నివాస, వాణిజ్య నిర్మాణాలకు కేంద్రం కానున్న బుద్వేల్
బుద్వేల్ కు ఓ వైపు ఓఆర్ఆర్..మరోవైపు ఎయిర్ పోర్ట్
అందుబాటు ధరల్లో గృహాలకు ఆస్కారం
పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు.. కూత వేటు దూరంలో ఐటీ కారిడార్.. కాస్త దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. ఎదురుగా భారీ జలాశయం.. ఓ ప్రాంతం అభివృద్ది చెందాలంటే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? యస్.. హైదరాబాద్ నగర శివారులోని బుద్వేల్ శరవేగంగా అభివృద్దికి ఆస్కారముంది. భాగ్యనగరానికి దక్షిణాన ఉన్న బుద్వేల్ భారీ నివాస ప్రాజెక్టులకు నెలవు కానున్నది. బుద్వేల్ లో హెచ్ఎండీఏ అభివృద్ది చేసి వేలం వేసిన వంద ఎకరాల వెంచర్ తో పాటు పరిసరాల్లోని వందల ఎకరాల్లో భారీ నివాస, నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో బుద్వేల్ మరో కోకాపేట్ అవుతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలన్ని శరవేగంగా అభివృద్ది చెందుతున్నాయి. ఇప్పటికే మౌళిక వసతుల పరంగా కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్ అయిన గ్రేటర్ సిటీ.. శివారు ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెంలగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో భాగ్యనగరం చుట్టూ అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఈ సందర్బంగా బుద్వేల్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలో ఉంటుంది బుద్వేల్. ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉండే బుద్వేల్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఐటీ కారిడార్ నెలవైన ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి బుద్వేల్ కేవలం 12 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇక బుద్వేల్ నుంచి శంషాబాద్ కు 11 కిలోమీటర్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బుద్వేల్ నుంచి కేవలం 15 నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ కు చేరుకోవచ్చు. బుద్వేల్ కు పక్కనే ప్రఖ్యాత రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. బుద్వేల్ నుంచి అటు సిటీలోకి వెళ్లాలన్నా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పీవీ ఎక్స్ ప్రెస్ వే నుంచి బెస్ట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఇక బుద్వేల్ హెచ్ఎండీఎ లేవుట్ నుంచి కేవలం 10 నిమిషాల్లో రైల్వేస్టేషన్ కు వెళ్లిపోవచ్చు.
బుద్వేల్ కు ఒకవైపు హిమాయత్‌సాగర్ వ్యూ కనిపిస్తుండగా, మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఇంకో వైపు రాజేంద్ర నగర్ ఉంటాయి. బుద్వేల్ నుంచి హిమాయత్ సాగర్ జలాశయానికి కేవలం 5 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. బుద్వేల్ కు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో స్కూల్స్, కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇక బుద్వేల్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్ లో ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉన్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లలో బుద్వేల్ కు సమీపంలో ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంతో బస్సు సౌకర్యం ఉంది. బుద్వేల్ పక్కనే ఉన్న కోత్వాల్ గూడలో ఎకో పార్క్ ను ప్రభుత్వం అభివృద్ది చేస్తోంది. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పెద్ద టూరిజం ప్రాంతంగా మారనుంది. ఇక బుద్వేల్ కు పది నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో మధ్య తరగతి వారికి నివాస ప్రాంతంగా అందుబాటులోకి వస్తుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
బుద్వేల్ లో హైదరాబాద్ మెట్రో డెలవప్మెంట్ అధారిటీకి చెందిన 300 ఎకరాల్లో 100 ఎకరాలను వేలం వేసింది ప్రభుత్వం. గత ఏడాది వేలంలో ఇక్కడ ఎకరానికి కనిష్ఠంగా 33.25 కోట్ల ధర పలకగా, అత్యధికంగా ఎకరానికి రూ. 41.75 కోట్ల ధర పలికింది. బుద్వేల్ హెచ్ఎండీఏ వెంచర్ వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొని భూములను దక్కించుకోవడంతో భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టాయి. ఐటీ హబ్ కు దగ్గరలో ఉన్న బుద్వేల్ లో హెచ్ఎండీఏ అభివృద్ది చేస్తున్న మౌలిక వసతులతో భారీ స్థాయిలో నివాస ప్రాజెక్టులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పలు నిర్మాణ సంస్థలు అపార్టుమెంట్లు, విల్లాలు నిర్మిస్తుండగా.. డబుల్ బెడ్రూం ఫ్లాట్ ధర రూ. 80 లక్షల నుంచి మొదలవుతోంది. ఇక విల్లాలు ప్రాజెక్టు, విస్తీర్ణాన్ని బట్టి రూ. 3 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. ఇక హెచ్ఎండీఏ వెంచర్ అభివృద్దితో ఇక్కడ భారీ నివాస ప్రాజెక్టులు రానుండటంతో ఐటీ హబ్ తో పోలిస్తే ఇక్కడ అందుబాటు ధరల్లో ఇళ్లు లభించే అవకాశం ఉందని రియాల్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బుద్వేల్ లో పెద్ద ఎత్తున ఓపెన్ ప్లాట్ వెంచర్లను అభివృద్ది చేశాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. హెచ్ఎండీఏ లేఅవుట్లలో ప్రాంతం, మౌలిక వసతులను బట్టి చదరపు గజం రూ. 45 వేల నుంచి 60 వేల వరకు ధరలున్నాయి. బుద్వేల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ప్రాజెక్టును బట్టి చదరపు అడుగు 6 వేల రూపాయల నుంచి 7 వేల రూపాయల మధ్య ధరల రేంజ్ ఉంది. ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం సైతం జరుగుతుండటంతో మధ్య తరగతి వారి చూపు బుద్వేల్ వైపు మళ్లుతోంది. ఐటీ హబ్ తో పాటు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, మణికొండ తదితర ప్రాంతాల్లో గృహాలకు మంచి డిమాండ్ ఉండటంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో అందుబాటు ధరల్లో ఇళ్లు కావాలనుకుంటున్న వారికి బుద్వేల్ మంచి డెస్టినేషన్ అని రియాల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. బుద్వేల్ లో హెచ్ఎండీఏ కు చెందిన మరో 200 ఎకరాలు భూములను సైతం వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీంతో ఈ ప్రాంతం అత్యంత వేగంగా అభివృద్ది చెంది, వచ్చే నాలుగైదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో మారిపోనుందని అంచనా వేస్తున్నారు.