Categories: LATEST UPDATES

గృహ రుణంతోపాటు ఇంటి బీమా త‌ప్ప‌నిస‌రి?

ఇల్లు కొనుక్కోవడం అనేది అతి పెద్ద, ముఖ్యమైన కల. అయితే, గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక అస్తిరత వంటి అంశాల నేపథ్యంలో మీకు నచ్చిన ఇల్లు కొనడం అనేది ఇప్పుడు అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తులకు ఇది మరింత కష్టం. ఒకేసారి మొత్తం డబ్బు పెట్టి కొనేయడం అస్సలు సాధ్యం కాదు. పైగా అది అంత తెలివైన నిర్ణయం కూడా కాదు. ఈ పరిస్థితుల్లో గృహ రుణం అనేది కీలక ప్రాధాన్యత పోషించే అంశం. గృహ రుణం తీసుకుని ఇల్లు కొనుక్కోవడం అనేది చాలామందికి ఉన్న ఏకైక చాయిస్. అయితే, ఇంటికి రుణం తీసుకున్నప్పుడు ఇంటికి బీమా కూడా తీసుకోవాలా అనే సందేహాలు వస్తున్నాయి.

గృహరుణంతోపాటు ఇంటి బీమా కూడా తీసుకోవడం తప్పనిసరి కాదు. ఆ బీమా తీసుకోవడం, తీసుకోకపోవడం అనేది పూర్తిగా మీ ఇష్టం. ఈ విషయంలో ఎవరూ బలవంతం చేయకూడదు. అయితే, రుణదాత తన ప్రయోజనాల దృష్ట్యా రుణంతోపాటు బీమా కూడా తీసుకోవాలని కోరొచ్చు. అయితే, దానిని మీరు కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు రుణదాత మీకు రుణం ఇవ్వకుండా తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏవైనా ఊహించని సంఘటనల వల్ల బీమా చేసిన ఆస్తి దెబ్బతిన్నా.. నాశనమైనా లేక రుణం తీసుకున్న వ్యక్తి మరణించినా రుణదాత నష్టపోయే అవకాశం ఉన్నందున బీమా తీసుకోకుంటే రుణం ఇవ్వడానికి నిరాకరించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది రుణదాతలు ఇంటి రుణం, ఇంటి బీమా కూడా సింగిల్ ప్రీమియం కింద కొనుగోలు చేయమని కోరతారు. దీనివల్ల మీకు అదనపు భారం ఉండదు. ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నాయి.

హోం లోన్ ఇన్సూరెన్స్..

మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకుని ఉండి, దానికి బీమా రక్షణ పొందాలనుకుంటే గృహబీమా తీసుకోవచ్చు. దురదృష్టకర ఘటనల నుంచి గృహ రుణాలను రక్షించే బీమా పథకం ఇది. సింగిల్ ప్రీమియం హోం ఇన్సూరెన్స్ తో సమానంగా దీని కవరేజ్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇతర బీమా ప్లాన్ల మాదిరిగానే విడిగా ప్రీమియం చెల్లించాలి.

సింగిల్ ప్రీమియం హోం ఇన్సూరెన్స్ ప్లాన్స్

ఇందులో ప్రతి దానికి విడిగా చెల్లించకుండా ఒకే ప్రీమియం కింద అటు గృహ రుణం, ఇటు గృహ బీమా మొత్తాన్ని చెల్లించొచ్చు. ఉదాహరణకు 32 ఏళ్ల కిషోర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రూ.30 లక్షల రుణం కోరారు. దానిని 15 ఏళ్లలో చెల్లించాలని నిర్ణయించకున్నారు. అంటే 15 ఏళ్లపాటు రూ.30 లక్షల రుణానికి రక్షణ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం 15 సంవత్సరాలుపాటు ఏడాదికి రూ.3300 ప్రీమియంతో గృహ బీమా కవరేజ్ కోసం రూ.49,500 చెల్లించాల్సి ఉంటుంది. అదే సింగిల్ ప్రీమియం కింద అయితే రూ.38వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది మీ హోమ్ లోన్ మొత్తానికి కలుపతారు. దానివల్ల మీరు చెల్లించే ఈఎంఐ కొంచెం పెరుగుతుంది. దీనివల్ల ఇంటి బీమా ప్రీమియం విడిగా చెల్లించడం భారంగా అనిపించదు. అయితే, ఇందులో కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. మీ లోన్ పూర్తిగా చెల్లించేవరకు బీమా సంస్థను మార్చడానికి వీల్లేదు. ఈ ప్లాన్ కింద మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. రుణ మొత్తం తగ్గుతున్న కొద్దీ బీమా కవరేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది. రుణం చెల్లించిన తర్వాత గృహ రుణ బీమా పాలసీ కూడా లాప్స్ అవుతుంది.

టర్మ్ ఇన్సూరెన్స్..

ఒకవేళ మీరు గృహ బీమా వద్దనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవచ్చు. రుణం తీసుకున్న వ్యక్తి అకాల మరణం తర్వాత సదరు రుణాన్ని మీ నామినీ చెల్లించడానికి ఈ ఇన్సూరెన్స్ ఉపకరిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గృహ రుణంతోపాట గృహ బీమా తీసుకోవడం తప్పనిసరి కాదు. అయినప్పటికీ, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కోవడం కోసం ఈ బీమా తీసుకోవడం మంచిదే. చిన్న ప్రీమియంతో చాలా క్లిష్టమైన పరిస్థితులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఈ బీమాతో లభిస్తుంది. అలాగే పాలసీదారుకు రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది.

ఇక్కడ మరో అంశం ఏమిటంటే.. గృహ రుణ బీమా గృహ బీమాకు మధ్య తేడాలను అర్థం చేసుకోవాలి. గృహ రుణ బీమా అనేది గృహ రుణ మొత్తాన్ని కవర్ చేయడానికి కొనుగోలు చేసిన బీమా. ఈ సందర్భంగా రుణ గ్రహీత మరణించినా.. ఇల్లు పాడైనా, నాశనమైనా ఈ బీమా ఉపయోగపడుతుంది. అదే గృహ బీమాలో కవరేజ్ మరోలా ఉంటుంది. దీనినే ఆస్తి బీమా అని కూడా అంటారు. ఇందులో గృహ రుణానికి కవరేజ్ ఉండదు. కేవలం ఆస్తికి మాత్రమే వర్తిస్తుంది. అంటే ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనాల వల్ల కలిగిన నష్టాల నుంచి ఇది రక్షిస్తుంది.

This website uses cookies.