రెండో కారిడార్ పొడిగింపుతోపాటు కొత్తగా 4, 5, 6, 7 కారిడార్లతో రూట్ మ్యాప్
హైదరాబాద్ మెట్రోకు కొత్త రూట్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. గత ప్రభుత్వం నిర్దేశించిన రూట్ మ్యాప్ రద్దు చేసి కొత్తగా రూట్ మ్యాప్ ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో మరో 70 కిలోమీటర్ల పొడవుతో ఫేజ్-2 మెట్రో రూట్ మ్యాప్ ను అధికారులు ఖరారు చేశారు. ప్రభుత్వం దీనిని ఆమోదించిన వెంటనే తదుపరి ప్రక్రియ మొదలుకానుంది.
గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా దీనిని రూపొందించారు. అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ ను కలుపుతూ కొత్త మార్గాలకు సంబంధించి ప్రతిపాదనలు చేశారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది.
కొత్త రూట్లు ఇవే..
జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్‌ను ఫేజ్-1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు.
కారిడార్ 4లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్‌దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), మైలార్‌దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో కొత్తగా ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) రూట్ మ్యాప్ ప్రతిపాదించారు.
కారిడార్ 5లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్ష్న్, నానక్ రామ్ గూడ జంక్ష న్, విప్రో జంక్షాన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) వరకు (8 కి.మీ.) వరకు మెట్రో రూట్ ప్రతిపాదించారు.
కారిడార్ 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్‌చెరు వరకు (14 కి.మీ.) రూట్ ఉంటుంది.
కారిడార్ 7 లో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.) కొత్త రూట్ ప్రతిపాదించారు.