Categories: LATEST UPDATES

ఇల్లు కొన‌డానికిది సరైన సమయమేనా?

ఓ వైపు కరోనా కొత్త వేరియంట్.. మరోవైపు భౌగోళికంగా మాంద్యం పరిస్థితులు.. ఇంకోవైపు పెరుగుతూ పోతున్న వడ్డీ రేట్లు. మరి ఇలాంటి సమయంలో ప్రాపర్టీ కొనుగోలు కరెక్టేనా?

ఇప్పటికే పలుమార్లు రెపో రేటు పెంచిన రిజర్వ్ బ్యాంకు.. ఇటీవల మరో 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 5.9 నుంచి 6.25 శాతానికి చేరింది. ఇది అన్ని రియల్ ఎస్టేట్ మార్కెట్లపై ప్రభావం చూపించనుంది. రెపో రేటు పెరిగిన కారణంగా బ్యాంకులన్నీ మళ్లీ వడ్డీ రేట్లు పెంచుతాయి. అది ఇళ్ల కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.

అయితే, సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఆకాంక్ష ఇప్పటికీ చాలామందిలో బలంగా ఉంది. కరోనా మిగిల్చిన అనుభవాలు అందరినీ సొంతింటి వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. అయితే, పెరుగుతున్న వడ్డీ రేట్లు కొంతవరకు ప్రతిబంధకంగా మారినా.. చాలామంది తమ సొంతింటి కోరికను వాయిదా వేయకుండా తమకు అనుకూలమైన హౌసింగ్ యూనిట్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెపో రేటు పెరుగుదల రియల్ రంగంలోనివారికి ఆశనిపాతంగా మారిందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

రియల్ రంగం వృద్ధి చెందాలన్నా.. పెట్టుబడిదారుల ప్రయోజనాలు నెరవేరాలన్నా.. స్థిరమైన రుణ రేట్లు ఉండాలి. అయితే, క్రమంగా పెరుగుతున్న రెపో రేట్లు రియల్ రంగంలో పెట్టుబడులపై ప్రభాం చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత రెపో రేటు మహమ్మారి ముందు ఉన్న స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉందని, ఇది లగ్జరీ రియల్ ఎస్టేట్ పై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.

అయితే, మిడ్ హౌసింగ్ మార్కెట్లు గతం కంటే కొన్ని అమ్మకాలు చూస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సందేహాలకు తావు లేకుండా ఇళ్ల అమ్మకాలు పెరగడం ఖాయమని.. పెట్టుబడిదారులు, తుది వినియోగదారులకు కఠిన పరిస్థితి ఉంటుందని వివరిస్తున్నారు. అయితే, ఇళ్ల ధరలు పెరిగినా.. ఇల్లు కొనుగోలు చేయాలనే ఉత్సాహం తగ్గిపోదని, భారతీయులు సొంతింటికి ఇచ్చే ప్రాధాన్యతే ఇందుకు కారణమని చెబుతున్నారు.

This website uses cookies.