- పెరిగిన నిర్మాణ వ్యయం
- మార్కెట్ విలువను నిర్ణయించిన ప్రభుత్వం
- యూడీఎస్‌లో కొన్నవారికి ఇక గడ్డుకాలమే
- డబ్బు వాపసు తీసుకోవాల్సిన తరుణమిదే
- లేకపోతే అసలుకే మోసం వస్తుంది!
రియల్ ఎస్టేట్ గురు, హైదరాబాద్: హైదరాబాద్‌లోకి యూడీఎస్, ప్రీలాంచుల పేరిట దొంగలముఠా ప్రవేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కొంతకాలం నుంచి వీరు చేసిన అరాచకం అంతాఇంతా కాదు. రెండు వేలకే ఫ్లాటు.. మూడు వేలకే లగ్జరీ అపార్టుమెంట్‌లో ఇల్లు.. నాలుగు వేలకే స్కై స్క్రేపర్‌లో ఫ్లాటంటూ వందలాది మంది నుంచి అక్రమంగా సొమ్మును లాగేశారు. యూడీఎస్, ప్రీలాంచ్ స్కామర్లు ముందస్తుగానే వంద శాతం సొమ్మును వసూలు చేసేశారు. ఇప్పుడిప్పుడే వాస్తవాల్ని అర్థం చేసుకున్న కొనుగోలుదారులు తమకు సొమ్ము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేటు తక్కువ అని కొన్నవారంతా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్ని గమనిస్తే.. ఈ అక్రమ ముఠాకు చుక్కలు కనిపిస్తున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలు కావడం.. పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడం వంటి అంశాల కారణంగా ఒక్కసారిగా నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. చదరపు అడుక్కీ ఎంతలేదన్నా ఇరవై శాతం దాకా పెరిగాయని నిర్మాణ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల్ని చూసి యూడీఎస్, ప్రీలాంచ్ బిల్డర్లు బెంబేలెత్తిపోతున్నారు. అనవసరంగా తక్కువ రేటుకు విక్రయించామని భావిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో వీరికి అర్థం కావట్లేదు. అందుకే, ఈ మధ్య కాలంలో యూడీఎస్, ప్రీలాంచ్ బిల్డర్ల హడావిడి కొంతమేరకు తగ్గిందని చెప్పొచ్చు. నిన్నటివరకూ వాట్సపుల్లో యమజోరుగా అమ్మేవారంతా ప్రస్తుతం చల్లబడ్డారని రియల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, రాష్ట్రంలో ఫ్లాట్ల కనీస ధరను ప్రభుత్వం నిర్థారించింది. అంటే, యూడీఎస్‌లో అమ్మినా ప్రీలాంచ్లో అమ్మినా.. ప్రభుత్వం నిర్దారించిన ధర కంటే తక్కువకు అమ్మడానికి వీల్లేదన్నమాట. అంతకంటే ఎక్కువ రేటుకు అమ్మితే కొనుగోలుదారులేమో ముందుకు రావట్లేదు. వీరంతా కాస్త తెలివిగా ఆలోచించడమే ఇందుకు ప్రధాన కారణం. సకాలంలో ఫ్లాటును అందిస్తాడన్న నమ్మకాన్ని బట్టి వీరు అడుగు ముందుకేస్తున్నారు. ఫలితంగా, యూడీఎస్ అక్రమాలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత పరిస్థితిలో యూడీఎస్‌లో ఫ్లాట్లను విక్రయించినా నిర్మాణం పూర్తి చేయడం కష్టమవుతుంది. ఉన్న సొమ్మంతా స్థల యజమాని చేతిలో పోస్టే.. పెరిగిన ధరల నేపథ్యంలో నిర్మాణం ఎలా కడతారు? కాబట్టి, యూడీఎస్ బిల్డర్లకు ముందు ఉంది ముసళ్ల పండగ అని కొందరు రియల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కొన్నవారు ఇరుక్కోపోయినట్లే?
ఇప్పటికే యూడీఎస్, ప్రీలాంచుల్లో కొన్నవారంతా వాస్తవ పరిస్థితుల్ని బేరీజు వేసుకోవాలి. సంబంధిత బిల్డర్ సకాలంలో నిర్మాణం పూర్తి చేయగలడా? లేదా? అనే అంశాన్ని ఆరా తీయాలి. లేకపోతే, కనీసం తమ సొమ్ము అయినా వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేయాలి. లేకపోతే, యూడీఎస్ బిల్డర్లు చేతులెత్తేసి బోర్డు తిప్పేస్తే అసలుకే మోసం వస్తుంది. కాబట్టి, తస్మాత్ జాగ్రత్త. కొత్తవారు ఎట్టి పరిస్థితిలో వీరి మాయలో పడకండి.