ఆర్ఈజీ టాస్క్‌ఫోర్స్ : జయ గ్రూప్ ఎండీ కాకర్ల శ్రీనివాస్ చౌదరీ రియల్ మోసాల్లో ఆరి తేరాడు. ఆరంభం నుంచీ.. దాదాపు పదికి పైగా రియల్ కంపెనీలను ఏర్పాటు చేసి ప్రజలను మోసగించిన కేసుల్లో అరెస్టయ్యాడు. ఆతర్వాత బయటికొచ్చాడు. ఇక చట్టం తనని ఏం చేయలేదని మెంటల్‌గా ఫిక్స్ అయినట్లు ఉన్నాడు. విశాఖపట్నంలో మోసం చేసి దర్జాగా బయటికొచ్చాడు. మళ్లీ ఏలూరు, ద్వారక తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలువురుని మోసగించాడు. అక్కడా కేసులు నమోదయ్యాయే తప్ప బాధితులకు ఎంతమాత్రం న్యాయం జరిగినట్లుగా కనిపించలేదు.
2016లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మకాం మార్చాడు. అక్కడి నుంచి తట్టా బుట్టా సర్ధుకొని కుటుంబంతో పాటు హైదరాబాద్ బాట పట్టాడు. ఇక్కడా మళ్లీ సేమ్ సీన్ రిపీట్. మొదట్లో ఏదో చిన్నగా కుత్బుల్లాపూర్‌లో కొత్తగా దుకాణం తెరిచాడు. ఊహించినట్టుగానే అక్కడా బాధితులు పెరిగారు. యధావిధిగా వందల మందిని మోసం చేశాడు. అక్కడా కేసులు నమోదయ్యాయి. పలుకుబడి ఉన్న వాళ్లకు ఎంతో కొంత ముట్ట చెప్పాడు. మిగతా వారికి శఠగోపం పెట్టాడు. 2018 తర్వాత కూకట్‌పల్లికి మకాం మార్చాడు.
* కేసులు తననేం చేయలేవు. కావాలంటే ఒక 100 కోట్ల మోసాలకు పాల్పడి.. హాలీడే ట్రిప్‌లా ఒక 5 లేదా 6 నెలలు జైలుకెళ్లి వచ్చేస్తా. అంతే కానీ నా మోసాలను నేను ఆపలేను. అది నా వ్యసనం. మీరు మోసపోతే నేను మాత్రం ఏం చేయగలను. మోసపోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్న అంటూ సినిమా డైలాగ్‌లా అతని బ్యాచ్‌కి.. కాకర్ల శ్రీనివాస్ మోసాల పీహెచ్‌డీ పాఠాలను వంట పట్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒక యాభై మందికి పైగా ప్రధానమైన వ్యక్తులను రంగంలోకి దించాడు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఇంటి నెం. 140/141, ఎమినెంట్ ప్లాజా, సిక్త్ ఫేజ్‌లో తన అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. డొల్ల కంపెనీలను మొదలెట్టాడు. జనాలు మోసపోవడానికి ఎన్ని దారులున్నాయో అన్ని దారులూ వెతికారు. చేయని బిజినెస్ అంటూ లేదు. అందులో ప్రధానమైనది.. రియల్ ఎస్టేట్ వ్యాపారం.
మొదట తెలివిగా మూడు ప్రాజెక్టులకు అనుమతుల్ని తీసుకుని ప్రజల్ని నమ్మించాడు. వాటిని చూపెట్టి దాదాపు పది ప్రాజెక్టుల్ని అమ్మేశాడు. అవి పేపర్లలో తప్ప.. వాస్తవంగా కనిపించవు. ఆ భూమి కూడా ఎక్కడా వీరి పేరు మీద కానీ, జయ గ్రూప్ కంపెనీకి కానీ సంబంధించినది కాదు. కానీ పేపర్లలో అగ్రిమెంట్లు, అప్రూవల్స్ కు పంపించిన పత్రాలు చూపించి కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. తనకు అనుకూలంగా ఉండే ఒక 50 మందిని 20 కంపెనీలకు డైరెక్టర్లు, సీఈవోలు, మేనేజర్లు అంటూ ప్రధానమైన పొజీషన్లలో కూర్చొబెట్టాడు. తక్కువ ధరకు ప్లాటు, గోపన్‌పల్లిలో స్థలాలు, మెట్రో స్టాల్స్ లాంటివి వస్తాయని ఆశపడి మోసపోయేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అవకాశంగా ఇచ్చామంటూ కాకర్ల శ్రీనివాస్ అండ్ బ్యాచ్ చెబుతున్నారు.
కాకర్ల శ్రీనివాస్‌ను నమ్మిన డబ్బు కట్టిన వారు మోసపోయారు తప్పితే.. డైరెక్టర్లు కాదు. వారికి సొంతంగా వ్యాపారాలను ప్రారంభించేందుకు డబ్బునిచ్చాడు. ఇక్కడి డబ్బును అక్కడికి మళ్లించి ఇదే తరహా మోసాలను చేసేందుకు వారిని రంగంలోకి దింపాడు. వారు అందరూ చేస్తున్నది కూడా రియల్ వ్యాపారమే. ప్రధానంగా ప్రతి డైరెక్టరు ఒక సొంత రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించాడు. అది కూడా జయ గ్రూప్‌ను మూసేసే దశలో వారి చేతి సొంతంగా రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి వారిని ముందు పెట్టి వ్యాపారం చేసేలా ప్లాన్ చేశాడు. ఇప్పటికే కొంత మంది వెంచర్లలో ప్లాట్లను సైతం అమ్మేశారు. ఇప్పటికి ఆ డైరెక్టర్లు చెప్పే ప్రధానమైన మాట.
మీ డబ్బుకు మాది గ్యారెంటీ. మేము కాకర్ల శ్రీనివాస్‌లా మోసం చేసే వారం కాదు. ప్రాణం పోయినా మీకు అన్యాయం చేయం. మా వెంచర్ అన్ని నిబంధనల ప్రకారం ఉందంటూ బుకాయిస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ వెంచర్లకు ఇప్పటికి ఎలాంటి అనుమతులు లేవు. హోచ్ఎండిఏ, డీటీసీపీ, రెరా లాంటి సంస్థల నుంచి ఆయా సంస్థల వెంచర్లకు అనుమతి రాలేదు. కాకర్ల శ్రీనివాస్ చేస్తున్న బిజినెస్‌ను విస్తరించే దిశగా ఆ కంపెనీ డైరెక్టర్లు సొంత దుకాణాలను ప్రారంభించారన్న వాదన సైతం వినిపిస్తుంది. మరి బాధితులకు ఈ డైరెక్టర్లు ఎందుకు న్యాయం చేయడం లేదు. పలుకుబడి ఉంటే తప్ప న్యాయం చేయరా? సామాన్యుల పరిస్థితి ఏంటి? లక్షల రూపాయలను కట్టి కాళ్లు అరిగేలా తిరిగే పరిస్థితికి కారణం ఈ డైరెక్టర్లు కాదా? మరి బాధితుల డబ్బు వారికి ఇప్పించే బాధ్యత డైరెక్టర్ల ది కాదా?
వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది వారికి తెలియకుండానే ఇతని మాయలో పడ్డారు. కొందరు డైరెక్టర్లుగా కాకర్ల శ్రీనివాస్ కంపెనీల్లో ఉన్నారన్న విషయం కూడా తెలియదు. కాకర్ల శ్రీనివాస్ దాదాపు ఒక 50 మందికి పైగా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఇదంతా తాను చేస్తూ.. వారి చేత చేయించినట్లుగా స్పష్టం అవుతోంది. వారంతా కాకర్ల చెప్పే మోసాల పాఠాలను ప్రజలకు చెప్పడం.. వారి నుంచి డబ్బులను కట్టించుకోవడం.. నమ్మేలా వారికి అవసరమైతే అగ్రిమెంట్స్ చేయడం లాంటివి చేశారు. కానీ అవన్ని కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం తప్పితే.. వాస్తవ రూపం దాల్చే పరిస్థితి లేదని స్పష్టం అవుతోంది. బాధితులు పోరాడితే తప్ప వారికి డబ్బులొచ్చే అవకాశాల్లేవని అందులోని కొంత మంది డైరెక్టర్లు తెలుపుతున్నారు. తమ చేతిలో కూడా ఏమి లేదంటున్నా.. వారంతా ఎప్పటికప్పుడు కాకర్ల శ్రీనివాస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి మోసపోయిన బాధితులకు న్యాయం ఎవరు చేస్తారన్నది సమాధానం తెలిసి సమస్య తీరని ప్రశ్నగా మిగిలిపోతుంది.
2011లో వైజాగ్, రాజమండ్రిలోనూ మోసాలకు పాల్పడ్డారు. అక్కడి స్థానిక పీఎస్‌లో కాకర్ల శ్రీనివాస్ పై కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోమలి అనే పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను నడిపించారు. ఈ సంస్థ మోసాలకు పాల్పడింది. ఇందులో 2016లో కాకర్ల శ్రీనివాస్ జైలుకు వెళ్లి బయటికి వచ్చాడు. అతని బాధితులైన ఏజెంట్లలో కొందరు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. నగరానికొచ్చి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌లోని ఇంటి నెం.140/141, ఎమినెంట్ ప్లాజా, సిక్త్ ఫేజ్ అడ్రస్ పేరు మీద ఇరవైకి పైగా కంపెనీలు.. అవి కూడా జూన్ 2020 తర్వాత ప్రారంభించిన డొల్ల కంపెనీలే.
అన్ని కంపెనీల్లోనూ కాకర్ల శ్రీనివాస్ డైరెక్టర్‌గా, సీఈవోగా లేదా ఇతర ఏదైనా పొజీషన్లలో ఉండటం గమనార్హం. పైన చెప్పినవే కాకుండా పలు కొత్త కంపెనీలను కాకర్ల శ్రీనివాస్ అండ్ బ్యాచ్ ప్రారంభించింది. ఇప్పటికి నడిపిస్తున్నారు కూడా. అయితే జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర్లో కమర్షియల్ అపార్ట్ మెట్‌లో రెండు ప్లోర్లు, కూకట్‌పల్లిలో పలు ప్రాంతాల్లో బిల్డింగులు, నగర శివార్లలో ఎకరాల కొద్ది భూములు ఉన్నట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఇరవై కంపెనీలే కాకుండా.. మరో 20 నుంచి 50 కంపెనీలను కాకర్ల మోసాల బ్యాచ్ నడిపిస్తున్నట్లుగా సమాచారం.
కాకర్ల శ్రీనివాస్ బంధువులు కూడా ఈ మోసాల్లో పాలు పంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మిగతా కంపెనీల్లో తన అనుచరుల చేతుల మీదుగా నడిపిస్తున్నారు. మరి ఆ కంపెనీలు ఇప్పటికి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. మరి ఇంకా ఎంతమంది మోసపోతారో.. ఎన్ని వందల కోట్ల రూపాయలను కొల్లగొడతారన్నది వారికే తెలియాలి. వారి టార్గెట్ ప్రజలను మోసం చేయడం. వారి కుటుంబం జల్సాలు చేయడం మాత్రమే అన్నట్లుగా కనిపిస్తోంది. మరి ఇన్ని మోసాలు చేసి సంపాదించిన సొమ్ముతో అతని కుటుంబం మరియు బంధువర్గం ఎంజాయ్ చేస్తుంది. మరి, ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని.. జయ గ్రూప్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను, రియల్ కంపెనీల అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలి. ప్రజలు మోసపోకుండా అడ్డుకట్ట వేయాలి.
This website uses cookies.