Categories: TOP STORIES

జీవో 69 అమ‌లు.. ఆత్మహత్యాసదృశ్యం

  • ముక్త‌కంఠంతో అభిప్రాయ‌ప‌డిన‌
    తెలంగాణ మాన‌వ హ‌క్కుల వేదిక‌
  • రెండు డ్యాములు వ‌ర‌ద నివార‌ణ కోస‌మే
  • మూసీ మురికిన‌దిగా మారే ప్ర‌మాదం
  • ప్ర‌కృతి ప‌ట్ల దురంహ‌కారం 111 జీవో ఎత్తివేత
  • 111 జీవోను బ‌లోపేతం చేసి అమ‌లు చేయాలి

జలమే జీవం.. ప్రాథమిక అవసరం.. ముంచుకొస్తున్న క్లైమేట్ సంక్షోభం వల్ల నీటి లభ్యతని అంత తేలిగ్గా తీసుకోలేం.. జీవో 111 పరిధిలోని 84 గ్రామాల పట్టణీకరణ చేస్తే.. మూసీ నది కాస్త‌ మురుగునీటి కాలువగా మారిపోతుంది. ఫ‌లితంగా హైదరాబాద్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ మానవ హక్కుల వేదిక, రాష్ట్ర జలవనరుల మండలి (డబ్ల్యూఐసీసీఐ), ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, సిటిజన్స్ ఫర్ హైదరాబాద్ వంటి సంఘాలు అభిప్రాయ‌ప‌డ్డాయి. ఇటీవ‌ల నగరంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఈ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతంలోని పేద మరియు సన్నకారు రైతుల అభివృద్ధి కోసం 69 జీవోను ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని విమ‌ర్శించారు. టన్నుల కొద్దీ నల్లధనంతో వస్తున్న రియల్టర్లు మరియు పెట్టుబడిదారులకు ప్రయోజనం క‌లిగించేందుకే 69 జీవోని అమల్లోకి తెచ్చాయని ఆరోపించారు. స్వల్పకాలిక రాజకీయ లాభాల కోసం తీసుకున్న రాజకీయ నిర్ణయంగా భావించి.. జీవో 111ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీవో 69ను అమ‌లు చేస్తే.. ప్ర‌శాంత‌మైన‌ భాగ్య‌న‌గ‌రం ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్లుగా మారిపోతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

మూసీ నది నీటిని కాపాడటానికి తాజా జీవో 69 ఎట్టి పరిస్థితిలో సరిపోదు. ఈ జీవోలో ప్రతిపాదించిన ఐదు చర్యలూ పనికి రావు. మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు మురుగు నీటిని తాగు నీటిగా మార్చలేవు. పాక్షికంగా శుద్ధి అయిన నీరు తిరిగి మూసిలోకే చేరుతుంది. జీవో 111 ఎత్తివేతతో జరిగే విస్తృత‌మైన పట్టణీకరణ వ‌ల్ల‌ నీటి కాలుష్యం భారీగా పెరుగుతుంది. ప్రస్తుత మూసీ నది స్థితి 69లో ప్రతిపాదించిన చర్యలు పని చేయవని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం.. ఈ జీవో 69 విడుదల ముందు.. 102 రోజులకు 51607 ఎంఎల్ డీ.. అంటే సగటున రోజుకి 506 ఎంఎల్డీ దాగునీరును సరఫరా చేశాయి. ఇది పాత 8 జిల్లాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ , ఖమ్మం, నల్గొండ , ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్ పట్టణాలకు సరఫరా అయ్యే మొత్తం తాగునీటి కంటే ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. ఈ ఏడాది రెండు రిజర్వాయర్ల నుంచి ఆక్రమణలన్నింటినీ తొలగించి రిజర్వాయర్లను అసలు డిజైన్ సైజుకు పునరుద్ధరిస్తే.. ప్రస్తుతమున్న 3.9 టీఎంసీల బ‌దులు 10 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ నీరంతా గ్రావిటీ ద్వారా పంపింగ్ ఖర్చు లేకుండానే ప్రవహిస్తుంది. అదే కృష్ణా మరియు గోదావరి నదుల నుంచి నీటిని తరలించడానికి రోజువారీ విద్యుత్తు ఖర్చు కనీసం రూ.2.7 కోట్ల రూపాయలు దాకా ఉంటుంది.

వ‌ర‌ద‌ల నివార‌ణే ల‌క్ష్యం..

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల ఏర్పాటు ప్రధాన లక్ష్యం.. వరదల నివారణ. 1908 మూసీ వరద వినాశనం తర్వాత నిర్మించినవే ఈ రెండు డ్యాములు. 2020 మరియు 2021లో కూడా హైదరాబాద్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా వరదలు సంభవించాయి. కాబట్టి, మూసికి తరుచుగా వరదలు వచ్చే అవకాశం ఉంది. పరివాహక ప్రాంతాన్ని పట్టణీకరణ చేస్తే, మురికినీటి ప్రవాహం పెరిగి.. రిజర్వాయర్లు దాదాపు నిండి ఉండటం వల్ల మురికి నీరు మొత్తం వరద నీరుగా మారి.. రిజర్వాయర్ల నుంచి విడుదల చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డుతుంది. అంతేకాకుండా, పెరుగుతున్న జనాభాతో పాటు మురుగు ఉత్పత్తి పెరగడంతో.. మూసీ మురుగునీటి కాలువగా మారుతుంది. ఏదైనా వరదలు సంభవించినప్పుడల్లా నగరంలో మురుగు నీరు వరద సమస్యను భారీగా పెంచుతుంది. అంతర్జాతీయంగా నదులను వ్యక్తికో, కార్పొరేషన్లో ఉన్న హక్కులన్నీ ఉన్న చట్టపరమైన వ్యక్తిగా గుర్తిస్తున్నారు. మూసీని మురుగు నీటి కాలువగా మార్చడం కాలుష్యరహితంగా స్వేచ్ఛగా ప్రవహించే హక్కుని భంగపర్చడమే.

కొద్దిపాటి వ‌ర్షానికే వ‌ర‌ద‌లు

మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టణీకరణతో వరద నీటి ఉదృతి పెరుగుతుంది. వాడుకలో లేని జలాశయాల్లో నీరెప్పుడూ నిండుగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చి చేరే వరద నీటిని వెంటనే వదిలేయాలి. తరుచూ సంభవించే అతివాతావరణ పరిస్థితులు నగర వాసులకు వరద ప్రమాద ఆలోచనను రేకెత్తిస్తాయి. మూసీ పరివాహక ప్రాంతంలో పట్టణీకరణతో హైదరాబాద్ నగర జనాభా 2050 నాటికి రెట్టింపయ్యి.. నీటి అవసరమూ పెరుగుతుంది. మురుగునీరూ రెట్టింపు అవుతుంది. మొత్తం మురుగునీటికి ఒకే మూసీ గనక వరదనీటిని తరలించే సమర్థత తగ్గుతుంది. కొద్దిపాటి వర్షానికే వరదలొస్తాయి. జీవ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న ప్రస్తుత తరుణంలో జీవో 69 నగరానికి ఆత్మహత్య లాంటిది. కాబట్టి, జీవో 69ని వెంటనే రద్దు చేయాలి. జీవో 111ను మరింత బలోపేతం చేసి అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు.

ప్ర‌కృతి ప‌ట్ల దుర‌హంకారం!

పెరుగుతున్న జనాభా వల్ల 1.32 లక్షల ఎకరాల పరివాహక ప్రాంతంలో పట్టణీకరణ పెరుగుతుంది. దీని వల్ల మురికినీటి ప్రవాహం, కాలుష్యం పెరుగుతాయి. మూసీ నదిని మురుగు నీటి కాలువగా మార్చేందుకు దోహదపడే నిర్ణయం.. జీవో 69ను అమల్లోకి తేవడమే! ఈ నిర్ణయం తెలంగాణ, జంట నగరాల ప్రజలకు మేలు చేసేది కాదని మానవ హక్కువ వేదిక అభిప్రాయపడుతున్నది. ఇది ప్రకృతి పట్ల నయా ఉదారవాద దురహంకారానికి ప్రతిబింబమని అంటున్నది. మూసీ పరివాహక ప్రాంతంలో పట్టణీకరణకు అనుమతించాలన్న నిర్ణయం.. పేద, సన్నకారు రైతుల ప్రయోజనాలకు మేలు జరగదని భావిస్తున్నామని చెబుతున్నది.

మార్కెట్ ధర కంటే చాలా తక్కువ నష్ట పరిహారంతో వేలాది ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ, రైతులను ప్రలోభ పెట్టి తమ వ్యవసాయ భూముల్ని రియల్టర్లకు ఎక్కువ ధరకు విక్రయించి అభివృద్ధి చేయడం.. ద్వంద్వ ప్రమాణాలతో కూడిన మోసం. అందుకే జీవో 69ని ఉపసంహరించి, జీవో 111ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నది. మానవ చర్యలతో ఉత్పన్నమయ్యే ప్రకృతి సంక్షోభాల నుండి ఈ రాష్ట్రానికి మినహాయింపు ఉండదు. స్వచ్ఛమైన గాలీ, నీరూ, ఆహారాలకు డబ్బు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.

మురికినీరు పెరుగుతుంది

ఉప నదులైన మూసా మరియు ఈసాల వాటర్ షెడ్ ప్రాంతంలో పట్టణ అభివృద్ధికి మార్గం సుగుమం చేస్తూ 111 జీవో ఎత్తివేయ‌డం వ‌ల్ల మురికినీటి ప్ర‌వాహం పెరుగుతుంది. నిర్మాణ ప్రాంతం పెరగడం వల్ల భూగర్భజలాల పునరుద్ధరణకు వీలు కాదు. నీటి ఇంకుడు తగ్గుతుంది. మరియు ప్రవాహం పెరుగుతుంది. భూగర్భ జలాల లభ్యత, నాణ్యత మరియు పరిమాణం ప్రభావితమవుతాయి. పట్టణీకరణతో మురికినీరు పెరిగి నీటి నాణ్యత ఘోరంగా క్షీణిస్తుంది.

This website uses cookies.