ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరయ్యాయని చెప్పి పలువురి దగ్గర డబ్బులు దండుకున్న ఆరుగురు సభ్యులన్న ముఠాను కాన్పూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి ఖాతాల్లో ఉన్న రూ.6.5 లక్షల నగదును స్తంభింపజేశారు. సాచెండికి చెందిన రామ్ బహదూర్ ఈ పన్నాగానికి ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. అతడితోపాటు సాజేటికి చెందిన శివ్ సింగ్, లాలా, నాంకే, బాబూ సింగ్, సాచెండికి చెందిన సోనూను అరెస్టు చేసినట్టు చెప్పారు. ‘ఈ ముఠా సభ్యులు తొలుత తమను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన అధికారులుగా పరిచయం చేసుకునేవారు. అనంతరం మీకు పీఎం ఆవాస్ యోజన కింది ఇల్లు మంజూరైందన నమ్మబలికేవారు. ఇందుకోసం చార్జీల రూపేణా కొంత మొత్తం చెల్లించాలని చెప్పి ఆ మేరకు నగదు తీసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత వారికి మళ్లీ ఫోన్ చేసి మరికొంత మొత్తం చెల్లించాలనో లేక కొన్ని పత్రాలు ఇవ్వాలనో అడిగేవారు. తర్వాత ఏటీఎం లేదా బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని, వాటి సహాయంతో వారి ఖాతాలను ఖాళీ చేసేవారు. ఇలా పలువురు బాధితులు వారి బారిన పడి మోసపోయారు. ఈ క్రమంలో రైల్ బజార్ కు చెందిన రజియా బేగం కూడా మోసపోవడంతో ఆమో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. కేసు దర్యాప్తు జరిపి ఆరుగురు నిందితులను అరెస్టు జైలుకు తరలించాం’ అని క్రైం బ్రాంచ్ డీసీపీ సల్మాన్ తాజ్ పాటిల్ వెల్లడించారు.