ఫ్లాట్ల అప్పగింతలో బిల్డర్లు జాప్యం చేస్తే, ఆ మేరకు కొనుగోలుదారులకు పరిహారం పొందే హక్కు ఉందని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్ సీడీఆర్ సీ) తాజాగా స్పష్టంచేసింది. పూర్తిస్థాయి ఫ్లాట్ అప్పగించే వరకు జరిగిన జాప్యానికి బిల్డర్లు పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఒకవేళ బిల్డర్ అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్ ను అప్పగించినా పరిహారం పొందే విషయంలో ఎలాంటి ప్రభావం ఉండబోదని తేల్చి చెప్పింది. ఢిల్లీకి చెందిన వికాస్ మిట్టల్ డీఎల్ఎఫ్ హోం డెవలపర్స్ లో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. బుకింగ్ మొత్తం కింద 2009 సెప్టెంబర్ లో రూ.7.5 లక్షలు చెల్లించి ఒక ఫ్లాట్ రిజర్వ్ చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం 2012 సెప్టెంబర్ లో ఫ్లాట్ అప్పగించాలి. అయితే, సదరు బిల్డర్ దాదాపు ఐదేళ్ల తర్వాత ఫ్లాట్ స్వాధీనం చేశారు. దీంతో డీఎల్ఎఫ్ హోం డెవలపర్స్ పై వికాస్ మిట్టల్ ఎన్ సీడీఆర్ సీలో పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన కమిషన్.. కొనుగోలుదారు చెల్లించిన మొత్తంపై ఏడాదికి 6 శాతం చొప్పున పరిహారం చెల్లించాలని ఆ సంస్థను ఆదేశించింది. ఆరు వారాల్లోగా పరిహారం మొత్తం చెల్లించాలని, లేనిపక్షంలో 9 శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుందని స్పష్టంచేసింది. ఎన్ సీడీఆర్ సీ వెలువరించిన తాజా తీర్పు చాలామంది గృహ కొనుగోలుదారులకు ఊరట కలిగించనుంది.