- ముంబైలో రెండు ప్రాపర్టీలు కొన్న బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన రియల్ ఎస్టేట్ పోర్టిఫోలియోను విస్తరించుకుంటున్నారు. నటనపరంగానే కాకుండా రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా దూసుకెళ్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి రూ.50 కోట్లు పారితోషకం తీసుకున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ముంబైలో రెండు విలాసవంతమైన ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. ఇందులో ఒకటి రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కాగా, రెండో వాణిజ్య స్థలం. ఇప్పటికే జుహూలో రూ.17.5 కోట్ల విలువైన రెండు అపార్ట్ మెంట్లు కార్తీక్ కొనుగోలు చేశారు.
అందులో ఒక ఫ్లాట్ ను రూ.4.5 లక్షలకు అద్దెకు ఇచ్చారు. తాజాగా అంధేరిలో 2వేల చదరపు అడుగుల వాణిజ్య స్థలం కొన్నారు. వీర దేశాయ్ లోని ఈ ఆఫీస్ స్థలం ఉంది. సీనియర్ నిర్మాత ఆనంద్ పండిట్ సూచనలు, సలహాల మేరకు కార్తీక్ ఆర్యన్ ఈ పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా వీర దేశాయ్ లో కూడా ఆయన సలహా మేరకు ఆర్యన్ ఆఫీసు స్థలం కొన్నారు. అమితాబ్, అజయ్ దేవ్ గన్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్లు అదే ప్రాంతంలో వాణిజ్య స్థలం కొని అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు వారి బాటలోనే కార్తీక్ ఆర్యన్ పయనిస్తున్నారు. తన నటనా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న తరుణంలో అటు సినిమా అవకాశాలను సరిగా అందిపుచ్చుకోవడంతోపాటు ఇటు రియల్ రంగంలోనూ సరైన నిర్ణయం తీసుకుంటున్నారు.