Categories: TOP STORIES

దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తికి.. ప్ర‌త్యేక హౌసింగ్ స్కీమ్ కావాలి!

* 2014తో పోల్చితే ప్లాట్ల‌ ధరలకు రెక్క‌లు
* సొంతింటి క‌ల సాకారం క‌ష్ట‌మే!
* ప్ర‌భుత్వ ఉద్యోగులూ కొనుక్కోలేరు
* ప్రైవేటు ఎంప్లాయిస్‌ది అదే ప‌రిస్థితి
* ఉచితంగా ఫ్లాట్ల‌ను క‌ట్టి ఇవ్వ‌క్క‌ర్లేదు
* త‌క్కువ రేటుకు ఫ్లాటు ఇస్తే చాలు
(కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌)

యావ‌త్ భార‌త‌దేశంలో తెలంగాణ రాష్ట్రం అతి పిన్న‌దైన‌ప్ప‌టికీ, అనేక అద్భుతాల్ని సాధించింది. అందుకే, జాతీయ మ‌రియు అంత‌ర్జాతీయ సంస్థ‌లు తెలంగాణ‌కు క్యూ క‌ట్టాయి. కాక‌పోతే, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను తీర్చేందుకు ప్ర‌భుత్వం ముందునుంచీ దృష్టి సారించ‌లేదు. ఫ‌లితంగా, వీరంతా తెలంగాణ ఆవిర్భావం నుంచి హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోలేక‌పోయారు. అప్ప‌టి ధ‌ర‌ల‌తో పోల్చితే ప్ర‌స్తుతం భూముల ధ‌ర‌లు కొండెక్కి కూర్చోవ‌డ‌మో ప్ర‌ధాన కార‌ణమని చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ మ‌రియు ప్రైవేటు ఉద్యోగుల సొంతింటి క‌ల తీరాలంటే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకానికి ప్ర‌త్యేకంగా ఒక హౌసింగ్ స్కీమును ఆరంభించ‌డంపై దృష్టి సారించాలి. ఇది చేస్తే.. యావత్ భార‌త‌దేశానికీ  బీఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం చేసిన‌ట్లు అవుతుంది.

దేశంలోని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలకు.. 2022లోపు గృహాల్ని క‌ట్టిస్తామ‌ని చెప్పిన‌ నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమయ్యారు. అధిక శాతం రాష్ట్రాల్లో కాగితాల మీద ఇళ్ల‌ వివ‌రాలు క‌నిపిస్తున్నాయే త‌ప్ప.. సొంతింటి ఆనందం ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ద‌క్క‌లేదు. 2015 జూన్ 17న అట్ట‌హాసంగా ఆరంభమైన హౌసింగ్ ఫర్ ఆల్ ప‌థ‌కం.. ఆత‌ర్వాత ర‌క‌ర‌కాలుగా రూపు మార్చుకుని.. ప్ర‌జ‌ల ముంగిట్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఆశించిన ఫ‌లితాల్ని సాధించ‌లేక‌పోయింది. ఈ ప‌థ‌కం విజ‌య‌వంతం అయ్యేందుకు అవ‌స‌ర‌మ‌య్యే నిర్ణ‌యాల్ని తీసుకోకుండా.. స‌మ‌ర్థులైన నిపుణుల అభిప్రాయాల్ని పరిశీలించ‌కుండా.. ఒంటెద్దు పోక‌డ‌ను అనుస‌రించ‌డం వ‌ల్లే.. నేటికీ దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అద్దె ఇళ్ల‌ల్లో మ‌గ్గుతున్నారు. కాబ‌ట్టి, అంద‌రికీ గృహం ప‌థ‌కం విఫ‌ల‌మైనందుకు గ‌ల కార‌ణాల్ని పూర్తిగా విశ్లేషించి.. సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో.. మధ్యతరగతి ప్రజానీకం కోసం ప్రత్యేకంగా ఒక ఇళ్ల పథకాన్ని ఆరంభించాలి. వీళ్ల కోసమే ప్రత్యేక పథకం ఎందుకంటారా..

కొన‌లేరు.. క‌ట్టుకోలేరు!

తెలంగాణ రాష్ట్రంలోని హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో గ‌ల నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను నిర్మిస్తోంది. రాష్ట్రంలో 6 లక్షల ఇళ్లు అవసరం కాగా.. కేవలం 2 లక్షల ఇళ్లను మాత్రమే చేపట్టింది. ఇది కేవలం అల్పాదాయ వర్గాల కోసమేనని గమనించాలి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల‌ల్లో ఉండ‌లేరు. అలాగనీ బ‌డా ఇళ్ల‌ను కొనుక్కోలేరు. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌ల్లో ప‌ని చేసే ఉద్యోగుల్లో అధిక శాతం మీద నేటికీ జీతం మీదే ఆధార‌ప‌డ‌తారు. ఈ కోవ‌కు చెందిన‌వారే అద్దె ఇళ్ల‌లో మ‌గ్గిపోతున్నారు. 2014తో పోల్చితే పెరిగిన స్థలాల రేట్ల‌ను దృష్టిలో పెట్టుకుంటే.. వీరు స్వ‌త‌హాగా ఫ్లాటు కూడా కొనుక్కోలేని దుస్థితి ఏర్పడింది. మ‌రి, ఇలాంటి వారి సంఖ్యే రాష్ట్రంలో అధికంగా ఉందనే విషయం మర్చిపోవద్దు. కాబ‌ట్టి, మధ్యతరగతి ప్రజానీకం కోసం ప్ర‌త్యేకంగా ఒక హౌసింగ్ స్కీమును ఆరంభించాల్సిన ఆవ‌శ‌క్య‌త ఎంతైనా ఉంది.

బీఆర్ఎస్‌.. అనేక ఘ‌న‌విజ‌యాలు..

గ‌తంలో దివంగ‌త నేత వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు.. ప్రైవేటు బిల్డ‌ర్ల కంటే త‌క్కువ రేటుకు నాణ్య‌మైన ఫ్లాట్ల‌ను అందించ‌డానికి రాజీవ్ స్వ‌గృహను ప్రారంభించి.. ప‌లు ప్రాంతాల్లో ఫ్లాట్ల‌ను క‌ట్టించారు. కాక‌పోతే, ఆయన మ‌ర‌ణించ‌గానే ఆ ఇళ్ల నిర్మాణం అర్థాంత‌రంగా ఆగిపోయింది. తెలంగాణ ఏర్ప‌డి ఎనిమిదేళ్ల‌యినా ఇప్ప‌టికీ ఆ ఫ్లాట్ల‌ను అమ్మ‌డానికి నానాతంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్ర‌భుత్వం ఫ్లాట్ల‌ను క‌ట్ట‌డం ఆరంభిస్తే అట్ట‌ర్‌ఫ్లాప్ అవుతుంద‌ని దీన్ని ద్వారా నిరూపిత‌మైంది. మ‌రి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం సొంతింటి క‌ల ఎలా తీరాలి? ఇందుకేమైనా మార్గ‌ముందా? తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక అసాధ్య‌మైన ప‌నుల్ని సుసాధ్యం చేసింది. అతి పిన్న రాష్ట్ర‌మైన‌ప్ప‌టికీ 24 గంట‌లు క‌రెంటు ఇస్తోంది. ఇంటింటికి తాగునీటిని స‌ర‌ఫ‌రా చేస్తోంది. రైతుబంధు, రైతుబీమా, క‌ళ్యాణల‌క్ష్మీ, కంటివెలుగు వంటి అనేక స్కీముల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తోంది. మ‌రి, ఇంత ఘ‌న‌విజ‌యం సాధించిన ప్ర‌భుత్వం మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను ఎందుకు సాకారం చేయ‌ట్లేదు? ఇందుకోసం వినూత్న‌మైన నిర్ణ‌యం తీసుకోవాలి.

ఇప్పుడేం చేయాలి?

హైద‌రాబాద్ ఐటీ రంగంలోని వివిధ కంపెనీల్లో.. ప్ర‌స్తుతం ఎనిమిదిన్న‌ర‌ ల‌క్ష‌ల మంది ఐటీ నిపుణులు ప‌ని చేస్తున్నారు. వీరిలో యాభై శాతం మంది సొంతిల్లు కొనుక్కోలేని స్థాయికి ఫ్లాట్ల రేట్లు పెరిగిపోయాయి. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ క‌లిసి ప‌ని చేస్తే త‌ప్ప సొంతిల్లు కొనుక్కోవ‌డం సాధ్యం కాని ప‌రిస్థితి నెల‌కొంది. త‌ల్లిదండ్రులు లేదా అత్త‌మామ‌లు సాయం చేస్తే త‌ప్ప కొనుక్కోలేని దుస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో.. ప్ర‌భుత్వం భూముల్లో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కోసం ఫ్లాట్ల‌ను నిర్మించేలా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించాలి. ఇదెలా సాధ్య‌మ‌వుతుంద‌ని అనుకోవ‌ద్దు. కొవిడ్ కాలంలో ప్ర‌పంచ‌మంత‌టా త‌లుపుల‌న్నీ మూసుకుని కూర్చుంటే.. హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల్ని అభివృద్ధి చేసిన ఘ‌న‌త మ‌న‌ది. కాబ‌ట్టి, ప్ర‌భుత్వం త‌లుచుకుంటే అసాధ్య‌మేం కాదు.

కోకాపేట్ వంటి ప్రాంతాన్ని హైటెక్‌సిటీ-2గా డెవ‌ల‌ప్ చేయ‌డానికి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది. మ‌రి, ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తికి అవ‌స‌ర‌మ‌య్యేలా అఫర్డ‌బుల్ ల‌గ్జ‌రీ ఫ్లాట్ల‌ను నిర్మిస్తే మెరుగ్గా ఉంటుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్ని ప్ర‌భుత్వ స్థ‌లాల్ని ప్రైవేటు డెవ‌ల‌ప‌ర్ల‌కు అంద‌జేసి.. పీపీపీ విధానంలో అపార్టుమెంట్ల‌ను క‌ట్టించినా మెరుగ్గా ఉంటుంది. ఇలా చేస్తే నిర్మాణాల్లో నాణ్య‌త పెరుగుతుంది.

అభివృద్ధిలో రైతుల‌కు భాగ‌స్వామ్యం!

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం క‌డుతోన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కంటే ఫ్లాట్ల సైజుల్ని పెంచి.. ఎలివేష‌న్లు డెవ‌ల‌ప్ చేసి.. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే స‌దుపాయాల్ని పొందుప‌రిస్తే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం సొంతింటి క‌ల సులువుగా తీరుతుంది. శివార్ల‌లో ఉన్న భూముల్ని రైతుల నుంచి సేక‌రించి.. అందులో వారికి భాగ‌స్వామ్యం క‌ల్పించి.. డెవ‌ల‌ప‌ర్ల‌కు ఆయా భూముల్ని నిర్మాణ‌ల్ని చేప‌ట్ట‌డానికి అప్ప‌గించి ఫ్లాట్ల‌ను నిర్మిస్తే.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం సొంతింటి క‌ల సులువుగా తీరుతుంది. అందులో వాణిజ్య స‌ముదాయాల‌కు స్థానం క‌ల్పించి.. వాటి ద్వారా వ‌చ్చే అద్దెలో కొంత శాతం సొమ్మును రైతుల‌కు కేటాయించాలి. దీంతో, వీరికి అభివృద్ధి చెందిన ప్లాట్ల‌తో పాటు ప్ర‌తినెలా ఎంతోకొంత ఆదాయం వ‌స్తుంది. అందులోనే డెవ‌ల‌ప‌ర్ల‌కు ఆదాయం వ‌చ్చేలా కూడా ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించొచ్చు.

రూ. కోటీ కావాల్సిందే

హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రంలో ఏ మూల‌కు వెళ్లినా.. డ‌బుల్ బెడ్‌రూం ఫ్లాట్ కావాలంటే క‌నీసం కోటి రూపాయ‌లు పెట్టాల్సిందే. ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ కోసం కోటిన్న‌ర దాకా చేతిలో ప‌ట్టుకోవాల్సిందే. మ‌రి, ఇంతింత సొమ్ము వీళ్లు ఎక్క‌డ్నుంచి తెస్తారు? అంతంత పెట్ట‌లేని మధ్యతరగతి ప్రజానీకానికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా హౌసింగ్ స్కీము కూడా ఆరంభించ‌లేదు. కాబట్టి, ఇప్పటికైనా మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచించాలి. దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఈ స్కీమును వర్తింపజేస్తే బీఆర్ఎస్ కు మంచి ఆదరణ లభిస్తుంది.

This website uses cookies.