హెచ్ఎండీఏ ప్రీ బిడ్ సమావేశాల్ని నిర్వహిస్తూ ప్లాట్లను వేలంలో అమ్మేందుకు శ్రమిస్తోంది. మరి, వీటి ద్వారా వచ్చే సొమ్మును దేనికోసం ఖర్చు పెడతారో? ఇంతవరకూ వేలం పాటల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చిన సొమ్మును ఏయే మౌలిక సదుపాయాల కోసం వినియోగించారో పాలకులకే తెలియాలి. అనుమతుల మంజూరులో పెద్దగా ఉత్సాహం చూపని హెచ్ఎండీఏ.. వేలం పాటలకు సంబంధించిన ప్రీ బిడ్ సమావేశాల్ని ఉత్సాహంగా నిర్వహిస్తోంది. ఎలాగైనా అధిక రేటుకు ప్లాట్లను విక్రయించాలని కంకణం కట్టుకున్నట్లు సిబ్బంది కనిపిస్తున్నారు. కాకపోతే, ఈ వేలం పాటల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి ఎక్కడ్లేని నష్టం జరుగుతుంది. ఎలాగో తెలుసా?
హెచ్ఎండీఏ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్లాట్లను వేలం వేస్తుంది. ఇందుకోసం సమావేశాల్ని ఏర్పాటు చేస్తూ.. పత్రికల్లో ప్రచారం నిర్వహిస్తుంది. దీంతో, ప్లాట్లను కొనడానికి కొంతమంది వ్యక్తుల మధ్య పోటీ ఏర్పడినప్పుడు.. సహజంగానే రేటెక్కువ పెట్టి కొనుక్కున్నవారికే ప్లాటు దక్కుతుంది. దీని వల్ల కలిగే నష్టమేమిటంటే.. ఆయా వేలంలో పలికిన రేటును.. అదే ప్రాంతంలోని ఇతర ప్రైవేటు వెంచర్లలోని ప్లాట్లకు వర్తింపజేస్తున్నారు. అయితే, ఇది కరెక్టు కాదనే విషయాన్ని కొనుగోలుదారులు గుర్తించాలి.
హెచ్ఎండీఏ నిర్వహించే వేలంలో ప్లాటు ధర పెరగడం వల్ల.. అదే రేటుకు ప్లాట్లను అమ్మేందుకు కొందరు ప్లాట్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. వేలంలో పలికే రేటు ఎట్టి పరిస్థితిల్లో ఇతర వెంచర్లకు వర్తించదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. హెచ్ఎండీఏ వేలం ధరనే ప్రామాణికంగా తీసుకుని.. కొందరు ప్లాట్ల యజమానులు స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ రేటు వచ్చేంతవరకూ కొంత ఓపికగా వేచి చూస్తే ఫర్వాలేదు. కాకపోతే, ఈ లోపు కొనేవారి సంఖ్య తగ్గిపోతుంది
వేలం పాటల్ని నిలిపివేసి ఆయా స్థలంలో అపార్టుమెంట్లను కట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రచిస్తే ఉత్తమం. వీలైతే ఒకే చోట నాలుగైదు ప్లాట్లను ఒకటిగా చేసి.. ఫ్లాట్లను నిర్మిస్తే.. అధిక శాతం మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కల తీరుతుంది. ఇలా కాకుండా, ప్లాట్లను అమ్మడం వల్ల ఒకరిద్దరికే లాభం కలుగుతుంది. కాబట్టి, అధిక శాతం మంది ప్రజలకు మేలు కలగాలంటే.. ఆయా ప్లాట్లలో అపార్టుమెంట్లను నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికల్ని రచించాలి. అపార్టుమెంట్ నిర్మాణం తమ బాధ్యత కాదు కదా అని హెచ్ఎండీఏ అనొచ్చు గాక.. అలాంటప్పుడు, హౌసింగ్ సంస్థకైనా నిర్మాణ బాధ్యతల్ని అప్పగిస్తే ఉత్తమం. లేకపోతే, ప్రైవేటు డెవలపర్లకైనా ఆయా అపార్టుమెంట్లను కట్టే బాధ్యతను అప్పగించాలి.