Categories: LATEST UPDATES

సెంటిమెంట్ సూపర్

  • ఆశాజనకంగా సెంటిమెంట్ ఇండెక్స్
  • పండగ సీజన్ నేపథ్యంలో పెరగనున్న ఇళ్ల విక్రయాలు
  • నైట్ ఫ్రాంక్-నరెడ్కో సంయుక్త సర్వేలో వెల్లడి

దేశంలో ప్రస్తుత సెంటిమెంట్ స్కోర్ ఇప్పటికీ ఆశాజనకంగానే ఉందని నైట్ ఫ్రాంక్, నరెడ్కో సంయుక్తంగా చేసిన సర్వేలో తేలింది. ఈ ఏడాది క్యూ2లో ఇది 63 ఉండగా.. క్యూ3లో 59కి తగ్గింది. మధ్యప్రాచ్యంలో అకస్మాత్తుగా పెరిగిన ఘర్షణలే ఇందుకు కారణమని విశ్లేషించింది. అయితే, ఇది ఇలాగే ఉండదని, ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోరు 64 నుంచి 65 వరకు పెరుగుతుందని అంచనా వేసింది. పండగ కాలంతోపాటు తదుపరి ఆరునెలలు ఆశాజనక వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఇక జోనల్ సెంటిమెంట్ స్కోర్ చూస్తే.. మిశ్రమంగా ఉంది. సౌత్, వెస్ట్ జోన్లలో ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్లు పెరిగాయి.

ఇక్కడ పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో కొనుగోలుదారుల మొగ్గు బాగుండటంతో స్కోర్ పెరిగింది. అయితే, నార్త్, ఈస్ట్ జోన్లలో ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ స్థిరంగా ఉంది. అదే సమయంలో డెవలపర్ ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ ఈ ఏడాది క్యూ2లో 65 ఉండగా.. క్యూ2లో 66కి పెరిగింది. ఇది గత 11 త్రైమాసికాల్లో అత్యధికం. ప్రస్తుతం వడ్డీ రేట్ల పెంపునకు విరామం ఇవ్వడంతో వచ్చే ఆరునెలల్లో రియల్ రంగం పరిస్థితి బాగుంటుందని రియల్టర్లు ఆశాజనకంగా ఉన్నారు. పైగా ఇది పండగ సీజన్ కూడా కావడంతో గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఇళ్లు అమ్ముడుపోతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు నాన్ డెవలపర్ (బ్యాంకులు, ఫైనాన్షిల్ సంస్థలు, పీఈ నిధులు) ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ కూడా పెరిగింది. 2023 క్యూ2లో ఇది 62 ఉండగా.. క్యూ3లో 64కి పెరిగింది. గత ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

రెసిడెన్షియల్ మార్కెట్ ఇలా..

ప్రస్తుత త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు, వాటి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పండగ సీజన్ లో ఇల్లు కొనాలనే కొనుగోలుదారుల సెంటిమెంటే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని సర్వేలో పొల్గొన్నవారిలో 60 శాతం మంది పేర్కొన్నారు. గత త్రైమాసికంలో 55 శాతం మంది మాత్రమే ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చారు. వడ్డీ రేట్ల పెంపులో విరామం, పెరుగుతున్న ఆదాయం, అందుబాటులో ఫైనాన్సింగ్ ఎంపికలు వంటి అంశాలే ఇందుకు కారణమని వివరించారు. అలాగే రాబోయే ఆరు నెలల్లో రెసిడెన్షియల్ లాంచింగులు కూడా పెరుగుతాయని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత త్రైమాసికంలో 62 శాతం మంది ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు. చాలామంది డెవలపర్లు ఈ పండుగ సీజన్ సందర్భంగా కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేస్తున్నారు. ఇక వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు పెరుగుతాయని 72 శాతం మంది పేర్కొన్నారు. గత త్రైమాసికంలో ఇలా అభిప్రాయపడినవారు 64 శాతం మంది ఉన్నారు.

జోరుగా ఆఫీస్ మార్కెట్..

భారతదేశంలో ఆఫీస్ మార్కెట్ జోరుగా కొనసాగుతోంది. వచ్చే ఆరునెలల్లో ఇది మరింతగా దూసుకెళ్తుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. భౌగోళిక పరిస్థితులు, మాంద్యంతో కాస్త ముప్పు ఉన్నప్పటికీ మనదేశంలో ఆఫీస్ మార్కెట్ డిమాండ్ కు ఢోకా ఉండదని.. లీజింగ్, సరఫరా, అద్దె ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. తదుపరి ఆరునెలల్లో ఆఫీస్ లీజింగ్ పెరుగుతుందని ఈ త్రైమాసికంలో 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే 49 శాతం మంది ఆఫీస్ సరఫరా మెరుగుపడుతుందని చెప్పారు. బలమైన లీజింగ్, కొత్త సరఫరాతో ఈ విభాగం పటిష్టంగా ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అలాగే అద్దెలు పెరుగుతాయని క్యూ3లో 54 శాతం మంది పేర్కొనగా.. క్యూ2లో ఇలా చెప్పినవారు 45 శాతం మంది ఉన్నారు.

This website uses cookies.