కళ్లు బైర్లు కమ్మే రీతిలో పెరిగిన ప్రాపర్టీ ధరలు
ఐదేళ్లలో 89 శాతం పెరుగుదల
కోకాపేట.. హైదరాబాద్ లో ఉన్న ఈ ప్రాంతం గురించి ఒకప్పుడు ఎవరికీ అంత తెలియదు. కానీ రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగినప్పటి నుంచి కోకాపేట అంటే తెలియనివారే లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి కోకాపేట ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ప్రైమ్ హబ్ గా అవతరించింది. ఇక్కడి ప్రాపర్టీ ధరలు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్యలో ఇక్కడి స్థిరాస్తి ధరలు ఏకంగా 89 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ ధరల పెరుగుదలతో కోకాపేట రెండో స్థానంలో నిలిచినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది.
గత ఐదేళ్లలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లోని టాప్-3 మైక్రో మార్కెట్లలో ధరల ట్రెండ్లను విశ్లేషించి ఈ మేరకు ఓ నివేదిక రూపొందించింది. 2019లో ఇక్కడ చదరపు అడుగు ధర సగటున రూ.4,765 ఉండగా.. 2024 ప్రథమార్ధంలో రూ.8,600కి పెరిగింది. ధరల పెరుగుదలలో బెంగళూరులోని బాగలూరు, వైట్ ఫీల్డ్ మొదటి, మూడో స్థానాల్లో నిలిచాయి. బాగలూరులో ఇళ్ల ధరలు 90 శాతం పెరిగాయి. ఇక్కడ 2020లో చదరపు అడుగుకు సగటు ధర రూ.4300 ఉండగా.. 2024 ప్రథమార్ధానికి రూ.8,151కి పెరిగింది.
వైట్ ఫీల్డ్ లో ధరలు 80 శాతం మేర పెరిగి.. చదరపు అడుగు సగటు ధర రూ.8,600కి చేరింది. ఇక ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవే ప్రాంతంలో ధరలు 79 శాతం మేర నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ 2019లో ఉన్న ధర రూ.5,359 నుంచి రూ.9,600కి పెరిగింది. బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డలో 58 శాతం మేర పెరిగి 5వ స్థానంలో నిలిచింది. 2019లో రూ.5,870 ఉన్న ధరలు రూ.9,300కి పెరిగాయి. హైదరాబాద్ లోని బాచుపల్లిలో సగటు ప్రాపర్టీ ధరలు రూ.3,690 నుంచి రూ.5,800కి పెరిగి 6వ స్థానంలో ఉంది. అలాగే తెల్లాపూర్ లో ప్రాపర్టీ ధరలు 53 శాతం పెరిగి 7వ స్థానంలో నిలిచింది.
ఇక్కడ చదరపు అడుగు ధర రూ.4,819 నుంచి రూ.7,350కి చేరింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో పన్వెల్ లో 50 శాతం పెరుగుదలతో 8వ స్థానంలో ఉండగా.. ఢిల్లీలోని న్యూ గురుగ్రామ్ లో 48 శాతం పెరుగుదలతో 9వ స్థానంలో నిలిచింది. ముంబైలోని డోంబివలి 40 శాతం పెరుగుదలతో 10వ స్థానంలో నిలిచింది. బెంగళూరులోని వైట్ ఫీల్డ్, సర్జాపూర్ రోడ్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా ఉండటంతో అక్కడ రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరిగింది.