కింగ్ జాన్సన్ కొయ్యడ
హైటెక్స్ లో జరిగిన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. బిల్డర్లలో గ్రీడీ (అత్యాశ) పెరిగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అందుకే, ప్రీలాంచ్ సేల్స్ చేస్తున్నారని.. ఇష్టం వచ్చినట్లు ఆకాశహర్మ్యాలను కట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో బిల్డర్లంతా ఎఫ్ఎస్ఐ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. అయితే, బిల్డర్లలో పెరిగిన గ్రీడి (అత్యాశ) తగ్గాలన్నా.. డెవలపర్లంతా దారిలోకి రావాలన్నా.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు.. అంటే, ఉమ్మడి రాష్ట్రంలో.. అప్పటి ప్రభుత్వం జీవో నెం. 168 విడుదల చేసింది. అందులో అపార్టుమెంట్ ఎత్తు పెరిగే కొద్దీ సెట్ బ్యాక్స్ పెరిగేలా నిబంధనలు ఉండేవి. కాకపోతే, తెలంగాణ ప్రభుత్వం 2019లో జీవో నెం. 50ని అమల్లోకి తెచ్చింది. దీని వల్ల ఆకాశహర్మ్యాల్లో సెట్ బ్యాక్స్ లేకుండా చేశారు. దీని వల్ల డెవలపర్లకు అధిక నిర్మాణ స్థలం వస్తోంది. ఈ అంశాన్ని గమనించిన స్థల యజమానులు.. నిర్మాణ స్థలం ఎక్కువగా ఇచ్చేవారికే తమ స్థలాన్ని డెవలప్మెంట్ నిమిత్తం ఇవ్వడం ఆరంభించారు. ఫలితంగా, డెవలపర్లలో సైతం పోటీతత్వం పెరిగింది. అయితే, సంప్రదాయ డెవలపర్లు ఆకాశహర్మ్యాల్ని కట్టేందుకు విముఖత చూపించేవారు. సందిట్లో సడేమియాలా కొత్త బిల్డర్లు.. లేదా ఇదివరకే వేరే కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నవారు.. ఆకాశహర్మ్యాల్ని కట్టేందుకు ముందుకొచ్చారు. కాకపోతే, వీరిలో అధిక శాతం మంది ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయించారు. కాబట్టి, ఇప్పటికైనా గాలిలో మేడలు కట్టేవారి సంఖ్య తగ్గాలంటే.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. జీవో 50ని రద్దు చేయాలి. లేదా ఈ జీవోలో సమూల మార్పులు తేవాలి.
తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించాక.. హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవడంలో విఫలమయ్యాం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయినా ఇప్పటివరకూ మాస్టర్ ప్లాన్ లేదంటే పురపాలక శాఖ ఉన్నతాధికారుల పనితీరును అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ నగరాన్ని చూసుకున్నా.. కనీసం యాభై ఏళ్లలో జరిగే అభివృద్ధిని అంచనా వేసి బృహత్ ప్రణాళికను సిద్ధం చేస్తారు. మరి, గత ఎనిమిదేళ్లుగా మాస్టర్ ప్లాన్ లేకుండా, అపార్టుమెంట్లు, ఆకాశహర్మ్యాలకు ఎలా అనుమతుల్ని మంజూరు చేస్తున్నారు? ఏయే ప్రాతిపదికన ఫీజుల్ని కట్టించుకుని అనుమతిని జారీ చేస్తున్నారో పురపాలక శాఖకే తెలియాలి. గత ఎనిమిది ఏళ్లలో సాధ్యం కానిది.. వచ్చే పద్దెనిమిది నెలల్లో సాధ్యమవుతుందా? అది జరిగితే పెద్ద రికార్డే అని చెప్పొచ్చు. అయితే, మంత్రి తలుచుకుంటే ఈ కార్యక్రమం త్వరగా పూర్తవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
కొందరు ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్ముతున్నారని మంత్రి ఒక మాట సందర్భంగా అన్నారు. మోసపూరిత డెవలపర్లను దారిలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన రెరా చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కఠినంగా అమలు చేయట్లేదు? ఈ అథారిటీని బలోపేతం చేయకుండా.. అక్రమాలకు అలవాటు పడ్డవారిని దారిలోకి తేకుండా.. వారికి కొమ్ము కాస్తోంది ఎవరు? ఫినీక్స్, వాసవి, సుమధుర, అర్బన్ రైజ్ వంటి సంస్థలన్నీ ఎంచక్కా ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించి.. ఆతర్వాత రెరా అనుమతిని ఎలా తెచ్చుకోగల్గుతుంది? అంటే, అక్రమాన్ని రెరా అథారిటీయే సక్రమం చేస్తుందా? మరి, ఈ రెరా అథారిటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కిందే పని చేస్తుంది కదా.. అలాంటప్పుడు, మోసపూరిత డెవలపర్లను దారిలోకి తెచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎందుకు కఠినంగా వ్యవహరించట్లేదు? రెరా అనుమతి లేకుండా ప్రీలాంచ్, యూడీఎస్‌లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే రియల్టర్లు, డెవలపర్ల నుంచి ఆయా ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధించాలి. కానీ, అలాంటి జరిమానాను మన వద్ద వసూలు చేయడం లేదు. ప్రీలాంచ్‌లో బిల్డర్లు యధేచ్చగా విక్రయిస్తున్నా.. రెరా అథారిటీలో చలనం లేదు.
ఒక ప్రాంతంలో ఆకాశహర్మ్యానికి అనుమతినివ్వాలంటే, ఆయా ప్రాంతంలో తొలుత మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలి. కానీ, ఇంతవరకూ ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు ముందుకు వేయలేదు. కేవలం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రహదారులు వేసి.. అవే మౌలిక అభివృద్ధి అని భావించడం అత్యాశే అవుతుంది. కనీసం ఇప్పుడైనా మౌలిక అభివృద్ధిని చేపట్టాకే ఆకాశహర్మ్యాలకు అనుమతినివ్వాలి.
This website uses cookies.