నిధుల కోసం సతమతమవుతున్న తెలంగాణ ప్రభుత్వం.. తొలిసారిగా ఓ పారిశ్రామిక ప్రాంతంలోని భూమిని క్రమబద్ధీకరించడం ద్వారా ఖజానా నింపుకోవాలని భావిస్తోంది. ముషీరాబాద్ సమీపంలోని అజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో దాదాపు 110 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ చేయడానికి సిద్ధమైంది. మార్కెట్ విలువ చెల్లించిన తర్వాత ఆ భూమిని ఫ్రీహోల్డ్ గా మార్చనుంది. ఇదంతా పూర్తయితే, రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.2వేల కోట్లు సమకూరతాయి. అంతేకాకుండా దీనివల్ల ఆ భూమిని దేనికైనా వినియోగించే వీలు వస్తుంది. ఫలితంగా ఆ భూమి కేటాయింపుదారులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలగనుంది. పైగా లీజుకు ఇచ్చిన పారిశ్రామిక స్థలం దుర్వినియోగం కాకుండా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపగా.. తాజాగా అసెంబ్లీలో కూడా ఆమోదం తెలిపారు.
* నిజాం హయాంలో ఈ భూమిని పారిశ్రామిక వినియోగం కోసం కేటాయించగా.. దాదాపు 60 మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. తర్వాత కంపెనీలు పలు పరిశ్రమలను స్థాపించగా.. కొన్ని సబ్ లీజ్డ్ యూనిట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేటాయింపుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు 1992లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆ లీజులను రద్దు చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి పునరుద్ధరించింది. తాజాగా ఆ భూమిని ఫ్రీహోల్డ్ కేటగిరీలోకి మార్చాలంటూ పలువురు లాబీయింగ్ చేయడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.