Categories: LEGAL

కూకట్ పల్లిలో రూ.వంద కోట్ల భూ కుంభకోణం

పార్కులు, స్కూళ్లు, ఇతర కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన ఐదు ఎకరాల భూమిని ప్లాట్లు చేసి అమ్మేసిన వ్యవహారం తాజాగా బయటపడింది. అధికారులతో కుమ్మక్కై ఉద్యోగుల సొసైటీయే ఇలా అక్రమాలకు పాల్పడిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్ జీజీ) వెల్లడించింది.

హైదరాబాద్ కూకట్ పల్లిలో హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంప్లాయీస్ సొసైటీ 1984లో 45 ఎకరాల్లో లేఔట్ వేసింది. ఇందులో పార్కులు, స్కూళ్లు, ఇతర కమ్యూనిటీ అవసరాల కోసం 5 ఎకరాల భూమిలో 12 ఖాళీ స్థలాలు కేటాయించారు. అయితే, స్థానిక రాజకీయ నాయకులు, సొసైటీ అధికార ప్రతినిధులు, హెచ్ఎండీఏ ఉద్యోగులు, రిజిస్ట్రేషన్ విభాగం, కూకట్ పల్లి మున్సిపాలిటీ సిబ్బంది కలిసి ఆ 12 ఖాళీ స్థలాల్లో దాదాపు 100 ప్లాట్లు వేసి విక్రయించారు.

ఈ విషయం ఆర్టీఐ ద్వారా బయటపడింది. ఖాళీ స్థలాలను ప్లాట్లుగా వేసి అమ్మేసినట్టు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఎఫ్ జీజీకి ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో వివిధ విభాగాల జోక్యం ఉన్నందున విజిలెన్స్ లేదా ఇతర ఏజెన్సీతో విచారణకు ఆదేశించాలని సీఎం కేసీఆర్ కు ఎఫ్ జీజీ లేఖ రాసింది. ’12 ఖాళీ స్థలాల్లో దాదాపు వంద ప్లాట్లను అక్రమంగా అమ్మేశారు.

కూకట్ పల్లి మున్సిపల్ సిబ్బంది సహకారంతో అక్కడ వాణిజ్య భవనాలను నిర్మిస్తున్నారు’ అని ఎఫ్ జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. అక్రమంగా కబ్జా చేసిన ఆ స్థలం విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అసలు అక్రమ ప్లాట్లను రిజిస్టర్ చేసి, నిర్మాణాలకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

This website uses cookies.