Categories: TOP STORIES

కేటీఆర్ శంకుస్థాపన చేసిన కొత్త ఐటీ పార్కు

హైటెక్ సిటీ దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరంభమైతే.. అంతకు మించిన విస్తీర్ణంలో దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్కును కండ్లకోయలో నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గురువారం గేట్ వే ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నార్త్ హైదరాబాద్లో 35 ఇంజినీరింగ్ కాలేజీలు, 50 డిగ్రీ కళాశాలలు, 35 ఎంబీఏ కాలేజీలు వంటివి ఉన్నాయని.. వీరందరూ పశ్చిమ హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడి ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకోవచ్చని అన్నారు. ఇందుకోసమే ఇక్కడ ఐటీ పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రిడ్ పాలసీలో భాగంగా.. ఉప్పల్లో 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జెన్ ప్యాక్ భవన నిర్మాణాన్ని ఇటీవల ఆరంభించామని వెల్లడించారు.

ప్రస్తుతం కండ్లకోయలో నిర్మిస్తున్న ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్న ఐటీ నిర్మాణం సరిపోదన్నారు. ఇంకా విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ కార్యాలయం హైదరాబాద్లోనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది దాదాపు 31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైందన్నారు. మేడిగడ్డ నుంచి మేడ్చల్ దాకా నీళ్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు. యువకులు ఉద్యోగాల్ని నెలకొల్పే స్థాయికి ఎదగాలని సూచించారు. అందుకే కొంపల్లిలో టీ హబ్ వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తర హైదరాబాద్లో ఇది ఆరంభం మాత్రమేనని, దుండిగల్ వంటి అనేక ప్రాంతాల్లో ఐటీ పార్కులు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎంఆర్ఎఫ్ మరో వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చిందన్నారు.

This website uses cookies.