Categories: LATEST UPDATES

కొత్త‌గా రెండు ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల ఏర్పాటు

రాష్ట్రంలోని న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో కొత్తగా రెండు ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌లు ఏర్పాట‌య్యాయి. ఈ మేర‌కు సోమ‌వారం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. న‌ల్గొండ‌కు నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థ అని పేరు పెట్టారు. మ‌హ‌బూబ్ న‌గర్‌కి మాత్రం ఆ జిల్లా పేరునే ఖ‌రారు చేశారు. నల్గొండ మున్సిపాల్టీతో పాటు 42 గ్రామాలను కొత్త ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌లో క‌లిపారు. ఇందులోకి న‌ల్గొండ మండలానికి చెందిన 22 గ్రామాలు, తిప్పర్తి 9, కనగల్ 6 గ్రామాలను చేర్చారు.

నార్కట్‌పల్లి, నకిరేకల్ మండలాలకు చెందిన 2 చొప్పున గ్రామాలు, కట్టంగూర్ మండలానికి చెందిన ఒక గ్రామాన్ని నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థలో కలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, నల్గొండ మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్‌గా దీనికి వ్యవహారిస్తారు. ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పాటు అధికారులు సభ్యులుగా ఉంటారు.

మహబూబ్ నగర్ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌..

మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలతో పాటు మరో 142 గ్రామాలతో మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో రూరల్ మండలానికి చెందిన 16, హన్వాడ మండలం 13, నవాబ్ పేట మండ‌లానికి చెందిన ఇర‌వై గ్రామాల్ని చేర్చారు. రాజాపూర్ మండలంలోని 16, జడ్చర్లలోని 22, భూత్పూర్ 13, మూసాపేట 12 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి.

దేవరకద్ర మండలానికి చెందిన 5, కోయిల్ కొండ మండలానికి చెందిన 8, గండీడ్ మండలానికి చెందిన ఒక గ్రామంతో పాటు బాలానగర్ మండలానికి చెందిన 15 గ్రామాలను మహబూబ్ నగర్ పట్టణాభివృద్ధి సంస్థలో ప్రభుత్వం చేర్చింది. ఇక నుంచి ఈ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌కు ఛైర్మ‌న్గా జిల్లా కలెక్టర్ చైర్మన్, వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు సభ్యులుగా ఉంటారు. దీంతో, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప‌ది పట్ట‌ణాభివృద్ధి సంస్థ‌లు ఏర్పాట‌య్యాయి.

This website uses cookies.