Categories: TOP STORIES

హెచ్ఎండీఏలో తూతూమంత్రంగా కూల్చివేతలు?

(రియ‌ల్ ఎస్టేట్ డెస్క్‌, హైద‌రాబాద్‌)

హైద‌రాబాద్లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. శంకర్ పల్లి, బడంగ్ పేట్, దుండిగల్, బోడుప్పల్, పోచారం మున్సిపాలిటీల్లోని పెద్ద సైట్ల మీదే ప్ర‌ధానంగా దృష్టి సారిస్తోంది. మొదటి రోజు 10 నిర్మాణాలు, రెండోరోజు మరో 13 నిర్మాణాల్ని అధికారులు కూల్చివేశారు. అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల ఈ విషయంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం దూకుడు పెంచింది. సోమవారం 600 గజాల మించిన నిర్మాణాలపై కూల్చివేత చర్యలను ప్రారంభించిన అధికారులు మంగళవారం మరో 13 అక్రమ భవనాలను కూల్చివేసారు. మొత్తంగా రెండు రోజుల్లో 23 అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయి. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు అక్రమ నిర్మాణాలు, దుండిగల్లో మూడు, బడంగ్ పేట్ లో మూడు, పోచారం మున్సిపాలిటీ పరిధిలో రెండు, బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఒక అక్రమ నిర్మాణాల్ని కూల్చివేశారు. ఇందులో ఒక పెట్రోల్ బంకు కూడా ఉండటం గమనార్హం.

అక్రమ నిర్మాణాల విషయంలో సంబంధిత మున్సిపాలిటీలలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముందే ఎందుకు గుర్తించలేదని పుర‌పాల‌క శాఖ వివ‌ర‌ణ కోరింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే, ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతను గమనిస్తే.. ఇదేదో తూతుమంత్రంగా చేస్తున్న ప్రక్రియగా కనిపిస్తుంది. ఎందుకంటే, మళ్లీ కట్టుకునే వీలుండేలా భవనాలను కూల్చివేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రధానంగా వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్ల నిర్మాణాల్ని కూల్చేస్తున్న ఫోటోలను గమనిస్తే ప్రతిఒక్కరికీ కలిగే సందేహమిదే. అంతెందుకు, గతంలో మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు జరిపినప్పుడే ఇలాగే ఎంతో పద్ధతిగా చేపట్టారు. అంటే, ఆతర్వాత అక్రమ నిర్మాణదారులు కట్టుకునేందుకు వీలుండేలా జరిపారన్నమాట. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వాటిని కట్టుకుని కిరాయిలకూ ఇచ్చేశారు. వీటి విషయంలోనూ ఇదే తంతు కొనసాగుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

This website uses cookies.