కరోనా సమయంలో కూడా హైదరాబాద్ రియల్ మార్కెట్ మరీ అంతగా కుదేలు కాలేదు. ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడి రియల్ హవా బాగానే నడిచింది. అయితే, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ప్రాభవం తగ్గుతున్నట్టు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ పోకడలను పరిశీలిస్తే.. ఇది సెటిలర్లకు అంత ఇష్టమైన నగరంగా లేదని అర్థమవుతోందని అంటున్నారు. అధికార టీఆర్ఎస్ ఇక్కడ రెండోసారి విజయం సాధించిన తర్వాత వారు అంతగా ఆసక్తి చూపించడంలేదని చెబుతున్నారు. ఆర్థిక మందగమనం ఇందుకు ఓ కారణం కాగా, కాస్త డబ్బున్న ఆంధ్రా ప్రజలు హైదరాబాద్ పై అంతగా ఆసక్తి చూపించకపోవడమే అసలైన అంశమని అంటున్నారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న గణాంకాలు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తిరోగమన ధోరణిని చూపిస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గత నాలుగు నెలలుగా ఆస్తుల క్రయ విక్రయాలు చాలా తగ్గాయి. హైదరాబాద్ సౌత్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మే నెలలో 3,337 లావాదేవీలు జరగ్గా.. జూన్ నాటికి 3,092కి తగ్గాయి. జూలైలో 3,764, ఆగస్టులో 4,103 లావాదేవీలు నమోదు కాగా, సెప్టెంబర్లో కేవలం 2,614 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో జూలైలో 31,903 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఆగస్టులో 29,652, సెప్టెంబర్లో 27,492 రిజిస్ట్రేషన్లు జరిగాయి. హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న మేడ్చల్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనూ ఈ తగ్గుదల కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసెట్ క్లాస్ లలో వృద్ధి నమోదవుతోంది.
This website uses cookies.