రాఫ‌ర్టీకి అమ్మేసిన రాయ‌దుర్గం మెట్రో వాణిజ్య‌ భ‌వ‌నం

*బీఎస్ఈకి రాసిన లేఖ‌లో పేర్కొన్న ఎల్అండ్‌టీ మెట్రో రైల్ కంపెనీ సెక్ర‌ట‌రీ

రాయ‌దుర్గం మెట్రో స్టేష‌న్ ప‌క్క‌నే గ‌ల ప‌దిహేను ఎక‌రాల వాణిజ్య భ‌వ‌నాన్ని ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ.. రాఫ‌ర్టీ డెవ‌ల‌ప్‌మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ‌కు విక్ర‌యించింది. ఇందులో బ్రూక్‌ఫీల్డ్ కార్పొరేష‌న్ మ‌రియు ర‌హేజా కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ‌లు భాగ‌స్వామ్యులు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ఎల్ అండ్ టీ మెట్రో రైలు లీగ‌ల్ హెడ్‌, కంపెనీ సెక్ర‌ట‌రీ చండ్ర‌చూడ్ డి పాలివాల్ బుధ‌వారం బీఎస్ఈకి అధికారికంగా తెలియ‌జేశారు. 2023 ఆగ‌స్టు 16న జ‌రిగిన ఈజీబీఎం ( ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్‌)లో.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇందుకు సంబంధించిన నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఈ అమ్మ‌కాన్ని స్లంప్ సేల్‌గా ఎల్అండ్‌టీ మెట్రో రైలు సంస్థ లేఖ‌లో అభివర్ణించింది.

* వాస్త‌వానికి ఈ ప‌దిహేను ఎక‌రాల వాణిజ్య భ‌వ‌నాన్ని బ్రూక్‌ఫీల్డ్ మ‌రియు ర‌హేజా సంస్థ‌ల‌కు విక్ర‌యించ‌డానికి 2022లోనే ఎల్అండ్‌టీ మెట్రో ఒప్పందం కుదుర్చుకుందని స‌మాచారం. అయితే, ఈ అమ్మ‌కానికి బుధ‌వారం నాడు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని బీఎస్ఈకి రాసిన లేఖ‌లో ఎల్అండ్‌టీ పేర్కొంది. మెట్రో రైలు అభివృద్ధి మ‌రియు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల్ అండ్‌టీకి 33 ఏళ్ల లీజు రాసిచ్చిన విష‌యం తెలిసిందే. ఒప్పందం ప్ర‌కారం రాయ‌దుర్గంలోని ప‌దిహేను ఎక‌రాల వాణిజ్య స్థ‌లంలో తొమ్మిది ఎక‌రాల్లో వాణిజ్య భ‌వ‌నాన్ని రూ.200 కోట్ల‌ను వెచ్చించి ఎల్అండ్‌టీ మెట్రో రైల్  అభివృద్ధి చేసింది. మ‌రి, ఈ భ‌వ‌నాన్ని పూర్తిగా విక్ర‌యించిందా? లేక 33 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఈ భూమి ప్ర‌భుత్వ ఆధీనంలోకి వ‌స్తుందా అనే విష‌యం తెలియాల్సి ఉంది.

This website uses cookies.