Categories: LATEST UPDATES

రియల్ కంపెనీల్లో డీఎల్ఎఫ్ టాప్

రూ.2,02,140 కోట్ల విలువతో అగ్రస్థానం

తర్వాతి స్థానాల్లో మాక్రోటెక్, ఇండియన్ హోటల్స్

హైదరాబాద్ కు చెందిన అపర్ణా కన్ స్ట్రక్షన్స్ కూ టాప్-10లో చోటు

భారత్ లోని అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ కంపెనీల్లో డీఎల్ఎఫ్ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ కంపెనీ విలువ రూ.2,02,140 కోట్లు అని గ్రోహె-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ నివేదిక వెల్లడించింది. 2024 సంవత్సరానికి సంబంధించి వంద మంది టాప్ కంపెనీల వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు.

డీఎల్ఎఫ్ తర్వాత రూ.1,36,730 కోట్లతో మాక్రోటెక్ డెవలపర్స్ రెండో స్థానంలో ఉంది. రూ.79,150 కోట్లతో ఇండియన్ హోటల్స్, రూ.77,280 కోట్లతో గోద్రేజ్ ప్రాపర్టీస్, రూ.66,200 కోట్లతో ఒబెరాయ్ రియల్టీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రూ.56,500 కోట్ల విలువతో అదానీ రియల్టీ ఏడో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ కు చెందిన అపర్ణా కన్ స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ రూ.33,130 కోట్ల విలువతో టాప్-10లో చోటు దక్కించుకుంది. ఇక రియల్ ఎస్టేట్ ఎంట్రప్రెన్యూర్లలోని టాప్-5 జాబితాలో కూడా డీఎల్ఎఫ్ నిలిచింది.

డీఎల్ఎఫ్ కు చెందిన రాజీవ్ సింగ్ రూ.1,24,420 కోట్ల ప్రాపర్టీ కలిగి ఉన్నారు. మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం (మాక్రోటెక్ డెవలపర్స్) రూ.91,700 కోట్ల ప్రాపర్టీతో రెండో స్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ కుటుంబం (అదానీ రియల్టీ) రూ.56,500 కోట్లతో మూడో స్థానంలో ఉంది. వికాస్ ఒబెరాయ్ (ఒబెరాయ్ రియల్టీ) రూ.44,820 కోట్ల ప్రాపర్టీతో నాలుగో స్థానంలో, చంద్రు రహేజా కుటుంబం (కె.రహేజా గ్రూప్) రూ.43,710 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కలిపి రూ.14.2 లక్షల కోట్ల విలువ కలిగి, దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. తద్వారా భారత్ ఆసియాలోనే రియల్ ఎస్టేట్ రాజధానిగా అవతరిస్తోంది.

This website uses cookies.