కో వర్కింగ్ స్పేస్ నుంచి పనిచేసే సంస్థల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ను మరింత సులభతరం చేయాలని ఆయా సంస్థలు, ట్యాక్స్ నిపుణులు కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఇలాంటి సంస్థలు జీఎస్టీలో నమోదు చేసుకోవాలంటే భారీగా వివిధ పత్రాలను అడుగుతున్నారు. ఇది వారికి తలకు మించిన భారంగా పరిణమిస్తోంది.భారత్ లో మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది పరీక్షించేందుకు చాలా బహుళ జాతి కంపెనీలు తొలుత చిన్నగా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని.. ముఖ్యంగా హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ ను ఎంచుకుని కో వర్కింగ్ స్పేస్ నుంచి పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని..
అందువల్ల కో వర్కింగ్ స్పేస్ నుంచి పనిచేసే సంస్థల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ను సులభతరం చేయాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా సదరు స్పేస్ యజమాని నుంచి ఎన్వోసీ తీసుకుని రావాలనే నిబంధన ప్రధాన అడ్డంకిగా మారిందని వివరిస్తున్నారు. ఈ పత్రాలు తీసుకురాలేకపోవడం వల్ల జీఎస్టీ రిజిస్ట్రేషన్ ను సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారని.. ఈ నేపథ్యంలో ఇలాంటి పత్రాల అవసరం లేకుండా సాధ్యమైనన్ని తక్కువ పత్రాలతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు.