- హైదరాబాద్‌కి వచ్చే 50 ఏళ్లలో నీటికొరత ఉండదు
- కమాండ్ కంట్రోల్‌తో మరింత సురక్షితం
- అనేకమంది ప్రజల రిటైర్మెంట్ లైఫ్ ఇక్కడే
- ప్రీలాంచ్, యూడీఎస్లో కొంటే ఎంతో రిస్క్
- 4, 12 ఎకరాల్లో ఐటీ, రెసిడెన్షియల్ స్పేస్
- డీఎస్ఎల్ ఇన్ఫ్రా ఎండీ మనోజ్ అగర్వాల్
కింగ్ జాన్సన్ కొయ్యడ: మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది.. ఇటీవల సీఎం కేసీఆర్ ఆరంభించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల.. వచ్చే యాభై ఏళ్ల దాకా భాగ్యనగరానికి నీటి కొరత ఉండదు. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో నీటి సమస్య రావొచ్చేమో కానీ మన వద్ద అలాంటి ఇబ్బందులే ఉండవని డీఎస్ఎల్ ఇన్ఫ్రా మేనేజింగ్ పార్టనర్ మనోజ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఉప్పల్‌లో ఐటీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసు కమిషనరేట్‌ని బంజారాహిల్స్‌లో ఆరంభిస్తుండటం.. ఇక్కడ మనుష్యుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. రానున్న రోజుల్లో హైదరాబాద్ మరింత సెక్యూర్డ్ సిటీగా అవతరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే పేరెన్నిక గల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించారని తెలిసిందన్నారు. దీంతో హైదరాబాద్ న్యూయార్క్ వంటి నగరాల సరసన నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ముంబై, ఢిల్లీతో సమానంగా విదేశీ విమానాల భాగ్యనగరానికి విచ్చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడి మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, కాస్మోపాలిటన్ కల్చర్ వంటివి ప్రతిఒక్కరినీ ఇక్కడే రిటైర్మెంట్ లైఫ్‌ను గడిపేలా చేస్తోందని వివరించారు. ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే..
‘‘ నార్త్ ఇండియాలో ఎన్సీఆర్ కానీ ముంబై కానీ తీసుకుంటే.. అక్కడ బ్రోకర్లే ఫ్లాట్లను కొని కొనుగోలుదారులకు విక్రయించేవారు. నేటికీ అదే పోకడ కొనసాగుతోంది. కానీ, ఇక్కడ డెవలపర్ల నుంచి కొనుగోలుదారులే నేరుగా ఫ్లాట్లను కొనుగోలు చేస్తారు. మన వద్ద స్పెక్యులేషన్ కంటే స్థిర నివాసం కోసం ఫ్లాట్లను ఎంచుకునే వారే ఎక్కువున్నారు. ఇన్‌కం ట్యాక్స్ కట్టేవారు, పన్ను పరిమితి కోసం ఇళ్లను కొనేవారి సంఖ్య మన దగ్గర అధికంగా ఉన్నారు.
అందుకే, హైదరాబాద్ రియల్ మార్కెట్ ఎంతో పరిణితి చెందిందని చెప్పొచ్చు. బ్రోకర్ల నుంచి నేరుగా ఫ్లాట్లను కొనడం మన వద్ద పెద్దగా కనిపించదు. యూడీఎస్, ప్రీలాంచ్ స్కీముల వల్ల మంచి ప్రాజెక్టుల మీద కచ్చితంగా దెబ్బ పడుతుంది. కాబట్టి, పెట్టుబడిదారులు ఎవరి వద్ద ఫ్లాట్ కొంటున్నామనే విషయాన్ని అంచనా వేసి తుది నిర్ణయం తీసుకోవాలి. రేటు తక్కువకే అమ్ముతున్నప్పటికీ.. ఆయా వ్యక్తికి ప్రాజెక్టుని పూర్తి చేసే సత్తా ఉందా? అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి.
అతి పెద్ద రిస్క్
యూడీఎస్, ప్రీలాంచ్ ఇల్లీగల్ కాబట్టి.. వాటిలో కొనడం అతి పెద్ద రిస్క్ అని చెప్పాలి. గతంలో ఆయా బిల్డర్.. బడా ప్రాజెక్టుల్ని కట్టాడా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలి. పేరెన్నిక గల డెవలపర్లు అయితే 30, 40 అంతస్తుల అపార్టుమెంట్లను అందజేస్తారు. కాకపోతే, యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించరు. ప్రస్తుతం మార్కెట్ మెరుగ్గా ఉంది కాబట్టి, ప్రీలాంచ్లో ఫ్లాట్లు అమ్ముడవుతున్నాయి. ఒక్కసారి మార్కెట్ కిందికి దిగడం ఆరంభమైతే అసలు సమస్యలు ఆరంభమవుతాయి. ఒక్కసారి మార్కెట్లో దిద్దుబాటు అంటూ ఆరంభమైతే, సిసలైన మ్యూజిక్ అప్పుడు వినిపిస్తుంది. ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయి. సకాలంలో ఫ్లాట్లను అందించడం కుదరదు. ప్రతిఒక్కరూ రిస్కులో పడిపోతారు. కాబట్టి, అలాంటి ప్రాజెక్టుల్లో కొనకపోవడమే అన్నివిధాల మంచిది.
రెండు ప్రాజెక్టులు..
ఉప్పల్‌లో డీఎస్ఎల్ వర్చ్యూ మాల్ అండ్ మల్టీప్లెక్స్ పూర్తయ్యాక.. ఇటీవల నాలుగు లక్షల చదరపు అడుగుల ఐటీ సముదాయాన్ని పూర్తి చేశాం. కొత్తగా హబ్సిగూడ ఎనిమిదో నెంబరు వీధిలో.. ఐటీ మరియు నివాస సముదాయాల్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో మేం 4 మరియు 8 ఎకరాల ల్యాండ్ పార్శిళ్లు కొనుగోలు చేశాం. తొలుత నాలుగు ఎకరాల్లో పది లక్షల చదరపు అడుగుల సముదాయాన్ని అభివృద్ధి చేస్తాం. ఇందులో ఐటీ నిర్మాణంతో పాటు నివాస సముదాయం ఉంటుంది. ఈ ప్రాజెక్టును 2022 జులై, ఆగస్టులో ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆతర్వాత పన్నెండు ఎకరాల్లో నిర్మాణాల్ని ఆరంభిస్తాం. దీంతో పాటు 50 నుంచి 70 ఎకరాల్లో ఫామ్ లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో ఒక్క ఫామ్ హౌజ్.. అర ఎకరం నుంచి ఎకరం స్థలంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.’’