- ఏపీ ప్రభుత్వానికి రియల్టర్ల వినతి
అనుమతి లేని వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని, లేఔట్ నిబంధనలను కాస్త సులభతరం చేయాలని ఏపీ ప్రభుత్వానికి పలువురు రియల్టర్లు విన్నవించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన చిన్న, మధ్యస్థ రియల్టర్లు తమ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చడానికి డీటీసీపీ అనుమతి తప్పనిసరి.
అలాగే లేఔట్లలో 33 అడుగుల రోడ్లు, పార్కుల కోసం ఓపెన్ ఏరియా, నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటిపారుదల డ్రైన్లు, ఓవర్ హెడ్ రిజర్వాయర్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల అనుమతి కలిగిన లేఔట్లలో ప్లాట్ల రేట్లు చాలా ఖరీదయ్యాయి.
నిజానికి ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి తేవడంతో కృష్ణా జిల్లాలో ఓపెన్ ప్లాట్ల రేట్లు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తేవడంతో పలువురు చిన్న, మధ్యస్థ రియల్టర్లు పట్టణాలు, నగరాల శివార్లలో చిన్న చిన్న లేఔట్లు వేస్తున్నారు. అనుమతి లేకుండా వేసిన ఈ లేఔట్లలో ప్లాట్లు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
ఒక్క కృష్ణా జిల్లాలోనే గత రెండేళ్లలో దాదాపు 630 వరకు ఇలాంటి లేఔట్లు వచ్చినట్టు అంచనా. అయితే, వీటిలో 12 అడుగుల రోడ్లు మాత్రమే ఉండటంతో ఆయా ప్లాట్ల రిజిస్ట్రేషన్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఇటీవల నిలిపివేసింది. దీంతో లేఔట్ నిబంధనలను సడలించాలని పలువురు రియల్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.