- నిర్మాణ పనుల షెడ్యూల్లో మార్పులు
- ఉదయం, సాయంత్రం పనులు.. మధ్యాహ్నం వేళ విశ్రాంతి
- అమ్మకాలు తగ్గిపోకుండా వర్చువల్ టూర్లు
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో వేడిగాలులు ఉధృతంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అటు నిర్మాణ పనులు, ఇటు అమ్మకాలు.. ఈ రెండూ అంశాలూ వేసవి వేడి కారణంగా ప్రభావం పడకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇటీవల కాలంలో ప్రాపర్టీ మార్కెట్లో ఎంక్వైరీలు, అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అవి తగ్గిపోకుండా అదే జోరు కొనసాగించేలా చేయాలని డెవలపర్లు కృత నిశ్చయంతో ఉన్నారు. దీంతో రోజువారీ జరిగే నిర్మాణ పనుల షెడ్యూల్ ను మార్చారు. ఉదయాన్నే కాస్త తొందరగా పనులు ప్రారంభించి, సాయంత్రం ఆలస్యంగా ముగించేలా ప్రణాళికలు రూపొందించారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో విశ్రాంతి ఇస్తున్నారు.
ఈ మేరకు బయట పనిచేసే కార్మికులకు సూచనలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న సమయంలో పనులు బయటి పనులు చేయిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో కార్మికులు సేద తీరేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సైట్లలోనే వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించడంతోపాటు డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసేందుకు ఓఆర్ఎస్ వంటివి సమకూరుస్తున్నారు.
అధిక వేడి కలిగించే రీఇన్ ఫోర్స్ మెంట్ వంటి పనులను మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు నిలిపివేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో చాలామంది డెవలపర్లు వీటిని పాటిస్తున్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక ఎండలు అటు నిర్మాణ పనులపైనే కాకుండా అమ్మకాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఎండ వేడికి భయపడి కొనుగోలుదారులు ప్రాపర్టీ సందర్శనలకు రావడంలేదు. దీంతో డెవలపర్లు ఇంట్లో నుంచే చేసేలా వర్చువల్ టూర్లు, త్రీడీ వాక్ త్రూలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాయితీలు, ప్రోత్సాహకాల వంటివి ప్రకటిస్తున్నారు.