Metro Railway Skywalks will resolve road accidents in Hyderabad
మీరో విషయం గమనించారో లేదో.. ఇప్పటికే పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుంచి.. షాపింగ్ మాళ్లకు మెట్రో ప్రయాణీకులు నేరుగా వెళ్లేలా పైవంతెనల్ని నిర్మించారు. అదే విధంగా జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్ లను కలుపుతూ ప్రయాణీకులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్‌లను డెవలప్ చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్‌లో 11 టవర్లలో నెలకొని ఉన్న.. అనేక అంతర్జాతీయ సంస్థలలో పని చేస్తున్న వారు.. సులభంగా చేరుకునే విధంగా.. రహేజా సంస్థ ఒక ఆధునిక స్కైవాక్ ని అనేక సౌకర్యాలతో నిర్మించిన విషయం తెలిసిందే. ఉప్పల్ మెట్రో స్టేషన్ ను ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న అన్ని రస్తాలను కలిపే విధంగా హెచ్ఎండీఏ వారు నిర్మించిన వలయాకారపు రోటరీ స్కైవాక్ మెట్రో ప్రయాణీకులకు, ఈ కూడలి రోడ్లు దాటే పాదచారులకు బాగా ఉపయోగపడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుండి స్కైవాక్ నిర్మాణం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీనికి వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి ఇతర నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల వారి నుండి మంచి స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్/ల్యాండ్ మార్క్ మాల్ కు ఆ సంస్థ వారే స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. ఎల్ బీ నగర్ స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనందనిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ వారు స్కైవాక్ నిర్మిస్తున్నారు. వాసవీ ఆనంద నిలయం కాంప్లెక్స్ మొత్తం 25 ఎకరాలలో ఒక్కొక్క టవర్ లోను 33 అంతస్తులతో మొత్తం 12 టవర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో పెద్ద సంఖ్యలో నివసించనున్న అనేక కుటుంబాలకు ఈ స్కైవాక్ చక్కటి సౌకర్యం కల్పిస్తుంది. అదే విధంగా మరికొన్ని సంస్థలు నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్ పల్లి వంటి అనేక మెట్రో స్టేషన్ల నుండి ఈ తరహా స్కైవాక్ లు నిర్మించడానికి తమతో చర్చలు జరుపుతున్నాయని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుండి ఇటువంటి స్కైవాక్ లు నిర్మించదలిస్తే.. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ మెట్రో రైల్ స్టేషన్ రిటైల్ అధికారి అయిన కె.వి. నాగేంద్ర ప్రసాద్ ను ఫోన్ నెంబర్ 9900093820 పై సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
* 69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రో మొదటి దశకు చెందిన మొత్తం 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్ యొక్క రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుండి మరో వైపునకు చేరుకునే సౌకర్యం ఉందని, వీటిని మెట్రో ప్రయాణీకులే కాక, అన్-పెయిడ్ మార్గాలుగా ఏ పాదచారులైన వినియోగించుకోవచ్చు. వీటిని వినియోగించుకుని ప్రమాదాల బారిన పడకుండా రోడ్డును సురక్షితంగా దాటొచ్చని గుర్తుంచుకోండి.
This website uses cookies.