Categories: TOP STORIES

శంషాబాద్ టు ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో కారిడార్ స‌ర్వే షురూ..

తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ 4.౦ పై ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ద ప్రాతిపదికన భవిష్యత్తు నగరానికి రవాణా సౌకర్యంపై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్.. అందుకు సంబంధించిన మెట్రో కారిడార్ సర్వే పనులను మొదలు పెట్టింది.

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సుమారు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతో పాటు, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహించనుంది.

శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుండి మీర్ ఖాన్ పేట్ లో.. నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ కోసం సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప‌నుల్ని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సమీక్షించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉండగా.. అది ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి మొదలై, కొత్తగా ఏర్పాట‌య్యే మెట్రో రైల్ డిపో పక్క నుంచి ఎయిర్ పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి.. ఎలివేటెడ్ మార్గంగా మన్ సాన్‌ప‌ల్లి రోడ్డు మీదుగా 5 కిలోమీటర్లు మెట్రో మార్గం ముందుకు సాగుతుంది. అనంతరం పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కు చేరుతుంది. అక్కడ బహదూర్ గుడాలో ఉన్న దాదాపు 1,000 నుండి 1,500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా.. బహదూర్ గుడా, పెద్ద గోల్కొండ లో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేసేలా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసింది.

  • రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 మీటర్ల వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. మెట్రో రైల్ కు కేటాయించిన రోడ్ మధ్య స్థలంలో.. మెట్రో రైల్ కారిడార్ ఎట్ గ్రేడ్ మెట్రోగా అభివృద్ధి చేస్తారు. ఈ విశాలమైన రోడ్ మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరు వైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుంది. మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేయడంతో పాటు ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తారు.
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డులో అంతర్భాగంగా భవిష్యత్తులో నిర్మించే మెట్రోకి తగినంత స్థలాన్ని కేటాయించారు. దీంతో ఇప్పుడు శంషాబాద్-ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ నిర్మాణానికి మార్గం సుగుమం అయ్యింది. వచ్చే మూడేళ్లలో ఈ మెట్రో కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ప‌ని చేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైద్రాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. మెట్రో సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. నార్త్ సిటీలోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
  • శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ లో ఆర్జీఐ ఎయిర్‌పోర్టు, ఎయిర్‌పోర్టు కార్గో, బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల్‌, కొంగరకలాన్‌, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్‌ యూనివర్సిటీ వరకు మొత్తం 40 కిలో మీటర్ల దూరానికి 16 మెట్రో స్టేషన్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భూగర్భ మార్గంలో 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్‌ మార్గంగా 6 కిలోమీటర్లు, ఓఆర్‌ఆర్‌ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలో మీటర్లు, భూమిపై 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జ‌రిగేలా ప్లాన్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కేవలం 40 నిమిషాల్లో ప్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం జ‌రుగుతుంది.
  • ఎయిర్‌పోర్టు నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్‌సిటీకి చేరుకునే విధంగా కారిడార్‌ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి మొదలవుతున్న కారిడార్‌.. రావిర్యాల మీదుగా, ఓఆర్‌ఆర్‌ వెంట వెళ్లే విధంగా డిజైన్‌ చేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీ కి అనువుగా గ్రీన్‌ కారిడార్లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూ చర్‌ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • శంషాబాద్ నుంచి ఫ్యూచ‌ర్ సిటీ వరకు మెట్రో రైల్ కారిడార్ పూర్త‌యితే రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు నగరంలో ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీకు పునాదులు పడటంతో అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఆస‌క్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో మెట్రో కారిడార్ తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయే అవ‌కాశ‌ముంది. వచ్చే ఐదేళ్లలో ఫ్యూచర్ సిటీ ప్రాంతం నివాస, వాణిజ్య కేంద్రాల‌కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంద‌ని అంటున్నారు.

This website uses cookies.