చంద్రాయన్ గుట్ట మెట్రో జంక్షన్ తో పెరగనున్న కనెక్టివిటీ
మెట్రో రెండవ దశతో మారనున్న హైదరాబాద్ దశ
శ్రీశైలం రహదారి పరిసరాల్లో రియాల్టీకి ఛాన్స్
హైదరాబాద్ మెట్రో రెండో దశతో హైదరాబాద్ దశ మారనున్నది. మెట్రో రెండో దశలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రతిపాదిత కొత్త కారిడార్-4కు ప్రస్తుతమున్న మూడు కారిడార్లను అనుసంధానం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఏ వైపున ఉన్న వారైనా మెట్రోలో విమానాశ్రయానికి చేరుకునేలా కారిడార్-1, 2, 3 లను కొత్త కారిడార్‌కు కలుపుతారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా విమానాశ్రయాల వరకు మెట్రో రైలు అనుసంధానం అనివార్యంగా మారింది.
అంతర్జాతీయ నగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ లోను శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్ మార్గాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. నాగోల్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మొత్తం 36.6 కిలో మీటర్ల మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది.
ఇప్పటికే హైదరాబాద్ మెట్రో కారిడార్-3 రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ఉంది. ఇక్కడే నాగోల్ విమానాశ్రయ మెట్రో స్టేషన్, అక్కడి నుంచి కొత్త కారిడార్ నిర్మించనున్నారు. ఇక మెట్రో కారిడార్-1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉంది. ఎల్బీనగర్‌లో విమానాశ్రయ మెట్రో మార్గానికి కలుపుతారు. అటు కారిడార్-2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉంది. ఈ మార్గాన్ని రెండో దశలో ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట వరకు విస్తరిస్తారు. చాంద్రాయణగుట్ట వద్ద అతిపెద్ద జంక్షన్‌స్టేషన్ నిర్మించి.. విమానాశ్రయ మెట్రోకు అనుసంధానిస్తారు.
వ్యయం తక్కువ అవుతుందని ముందు నాగోల్-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి నుంచి పీ-7 రోడ్డు మీదుగా విమానాశ్రయ మార్గాన్ని పరిశీలించారు. దీంతో పోలిస్తే మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్, శంషాబాద్ మీదుగా విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నట్లు డీపీఆర్ రూపొందించే క్రమంలో చేపట్టిన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ లో గుర్తించారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగించుకునే అవకాశం ఉందనే నిర్ణయానికి వచ్చారు. కేంద్రం సైతం మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటే సీఎంపీని కీలకంగా పరిగణిస్తుంది. దీంతో ఆరాంఘర్ మార్గాన్ని సర్కారు ఖరారు చేసింది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టులో అతి పెద్ద మెట్రో జంక్షన్ పాతబస్తీలోని చంద్రాయన్ గుట్టలో నిర్మాణం కాబోతోంది. దీంతో ఓల్ట్ సిటీ ముఖచిత్రమే మారిపోనుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోట్రో రైల్ రూపంలో కనెక్టివిటీ పేరగనుండటంతో చాలా మంది చంద్రాయన్ గుట్ట సమీప ప్రాంతాల్లో సొంత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. నగరంలో అద్దెకు ఉంటున్నవారు మెట్రో రైల్ అందుబాటులోకి వస్తుండటంతో కాస్త దూరమైనా అందుబాటు ధరల్లో ఇంటి స్థలం లేదంటే ఇల్లు కొనుక్కోవచ్చని అనుకుంటున్నారు.
ఇందుకు అనుగునంగానే పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, నిర్మాణ కంపెనీలు చంద్రయాన్ గుట్టకు కనెక్ట్ అయ్యే శ్రీశైలం రహదారి వెంట రియల్ ప్రాజెక్టుల కోసం ఇప్పచి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ముచ్చర్ల ఫోర్త్ సిటీ ప్రకటనతో శ్రీశైలం హైవే పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఊపందుకోగా.. ఇప్పుడు మెట్రో రెండవ దశ ప్రాజెక్టుతో మరింత జోరందుకునే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చంద్రాయన్ గుట్ట నుంచి శంషాబాద్ మెట్రో తో కనెక్ట్ అయ్యే శ్రీశైలం రహదారిలోని తుక్కుగూడ, కందుకూరు, కడ్తాల్, ఆమన్ గల్, వెల్డండ, కల్వకుర్తి వరకు రవాణా సౌకర్యం పెరగనుంది. దీంతో హైదరాబాద్ లో పనిచేసే లక్షలాది మంది ఆయా ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కందుకూరు, తుక్కుగూడ ప్రాంతాల్లో ఇప్పటికే భూములు, నివాస స్థలాలు, ఇళ్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో కడ్తాల్, ఆమన్ గల్, వెల్డండ, కల్వకుర్తి ప్రాంతాల్లో ధరలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఆమన్ గల్ నుంచి మొదలు కల్వకుర్తి వరకు శ్రీశైలం రహదారిపై ఎకరం భూమి కొటిన్నర నుంచి మూడు కోట్ల రూపాయలు ధర పలుకుతోంది. శ్రీశైలం హైవేకు కాస్త లోపల ఐతే ఎకరం 80 లక్షల నుంచి కోటిన్నర వరకు ధరలున్నాయి. తుక్కుగూడ, కందుకూరు పరిసరాల్లో ఇండిపెండెంట్ ఇళ్లు 60 నుంచి కోటి రూపాయల్లో లభిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇక్కడ అపార్ట్ మెంట్ కల్చర్ మొదలవుతోంది. కానీ విల్లాల నిర్మాణం మాత్రం భారీ స్థాయిలో ఉంది. తుక్కుగూడ, కందుకూరు ప్రాంతంలో ఒక్కో విల్లా విస్తీర్ణం, ప్రాజెక్టును బట్టి కోటి 20 లక్షల నుంచి 8 కోట్ల వరకు ధరలున్నాయి.
చంద్రాయన్ గుట్ట మెట్రో జంక్షన్ ఏర్పాటై, శంషాబాద్ వరకు మెట్రో కనెక్టివిటీ పెరిగితే.. ఆమన్ గల్ నుంచి మొదలు కల్వకుర్తి వరకు అందుబాటు ధరల్లో సొంత నివాసం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆమన్ గల్ లో ప్రస్తుతం ఇంటి స్థలం డీటీసీపీ లేఅవుట్ లో సుమారు 8 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ఉంది. కల్వకుర్తిలో ఐతే చదరపు గజం 7 వేల రూపాయల నుంచి 18 వేల రూపాయల వరకు ధరలున్నాయి.
ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నవాళ్లు ధరలు తక్కువగా ఉన్న ఇటువంటి సమయంలోనే ఇంటి స్థలం లేదంటే ఇళ్లు కొనుక్కోవాలని సూచిస్తున్నారు. మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే ఇక్కడ కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకని మీరు పని చేసే ప్రాంతం, మీ బడ్జెట్, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ సొంతిల్లు ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకోండి.
This website uses cookies.