Categories: TOP STORIES

ఔరా.. ఐరా..  వద్దా రెరా?

  • మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పెట్టుబ‌డిదారుల్నుంచి
  • రూ.300 కోట్లు కొల్ల‌గొట్టే స్కెచ్‌
  • 150 ఎక‌రాలు ఫ‌ర్ సేల్‌
  • నో డీటీసీపీ, రెరా ప‌ర్మిష‌న్‌
  • గ‌జానికి రూ.8,500
  • ఈ సంస్థ సభ్య‌త్వాన్ని నిర్మాణ సంఘం త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి!

స్థానిక సంస్థ‌ల అనుమ‌తి అక్క‌ర్లేదు.. రెరా ప‌ర్మిష‌న్ తీసుకోన‌క్క‌ర్లేదు.. కానీ, ధ‌ర త‌క్కువ‌ని చెప్పి కోట్లు కొల్ల‌గొట్ట‌వ‌చ్చ‌ని హైద‌రాబాద్‌లోని ప‌లు రియ‌ల్ సంస్థ‌లు నిరూపిస్తున్నాయి. అక్ర‌మంగా సంపాదించిన సొమ్మును ఏం చేయాలో? ఎలా పంచుకోవాలో? తెలియ‌క కొన్ని కంపెనీల్లో భాగ‌స్వామ్యులు కొట్టుకుంటున్న సంద‌ర్భాలున్నాయి. ఒక‌రి మీద ఒక‌రు పోలీసు స్టేష‌న్ల‌లో కేసులు పెట్టుకుంటున్నవి క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నాయి. తాజాగా, ఒక రియ‌ల్ సంస్థ‌.. ఐరా రియాల్టీ శంక‌ర ప‌ల్లి త‌ర్వాత వ‌చ్చే మోమిన్‌పేట్‌లో 150 ఎక‌రాల స్థ‌లాన్ని చూపెట్టి.. ధ‌ర త‌క్కువంటూ.. అటు కొనుగోలుదారులు.. ఇటు పెట్టుబ‌డిదారుల్నుంచి సొమ్ము కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం ఆరంభించింది.

రెరా అనుమ‌తి తీసుకుని విక్ర‌యిస్తే ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌దు. ఆ అనుమ‌తి లేకుండా విక్ర‌యించ‌డం వ‌ల్లే అసలు స‌మ‌స్య ఏర్ప‌డింది. ఇలా అక్ర‌మంగా విక్ర‌యించిన ప్లాట్ల‌లో వ‌చ్చిన సొమ్మును సంస్థ రాజ‌కీయ నాయ‌కుల‌కు విరాళంగా కూడా అంద‌జేస్తుంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల కాలంలో మంత్రి కేటీఆర్‌ని క‌లిసి రూ25 ల‌క్ష‌ల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి కూడా అంద‌జేశారీ సంస్థ ప్ర‌తినిధులు. దీంతో, ఈ సంస్థ‌ను ప్ర‌శ్నించ‌డానికీ పుర‌పాల‌క శాఖ‌, రెరా ఉన్న‌తాధికారులూ వెన‌క‌డుగు వేసే ప‌రిస్థితి ఏర్ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు.

హైటెక్ సిటీ నుంచి 70 కిలోమీట‌ర్ల దూరంలోని శంక‌ర్ ప‌ల్లి మోమిన్‌పేట్ రోడ్డులో చీమ‌ల‌దారి ప్రాంతంలోని బంజరు భూమిలో విలాసవంతమైన గృహాల్ని నిర్మించాల‌న్న‌ది ఐరా రియాల్టీ ప్ర‌ధాన ఉద్దేశ్యం. విన‌డానికిది ఎంతో విన‌సొంపుగా ఉంది. అక్క‌డ‌ ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన గృహాల్ని నిర్మించాల‌నేది సంస్థ ల‌క్ష్యం. ల‌క్ష్యం మంచిదే.. ఎవ‌రూ కాద‌న‌లేరు.. న‌గ‌రానికి దూరంగా ప్ర‌శాంతంగా నివ‌సించాల‌ని కోరుకునేవారికి ఇది చ‌క్క‌గా ప‌నికొస్తుంది. కాక‌పోతే, ఇంత‌టీ బ‌డా ప్రాజెక్టును చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. ప్ర‌జ‌ల్నుంచి పెట్టుబ‌డి రూపంలో సొమ్మును స‌మీక‌రించాల‌ని అనుకున్న‌ప్పుడు.. హెచ్ఎండీఏ/ డీటీసీపీ రెరా అథారిటీ అనుమ‌తి తీసుకుంటే ఎవ‌రికీ ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. కొనుగోలుదారులూ ఎంచ‌క్క‌గా కొనుక్కుంటారు. కాక‌పోతే, రెరా అనుమ‌తి లేకుండా ఎలాంటి అమ్మ‌కాలు చేయ‌కూడ‌దు. ఫ‌లానా ప్లాటు లేదా ఫ్లాటు అమ్ముదామ‌ని ఎవ‌రికీ చెప్ప‌కూడ‌దు. ప్రాజెక్టు గురించి ప్ర‌క‌ట‌న‌ల్ని విడుద‌ల చేయ‌కూడ‌దు. కానీ, ఐరా రియాల్టీ ఏం చేస్తోంది?

ఇంట‌ర్నెట్ నుంచి విదేశీ బొమ్మ‌ల్ని తీసుకుని.. ర‌క‌ర‌కాల డిజైన్ల‌ను సేక‌రించి.. ఒక చూడ‌చ‌క్క‌టి బ్రోచ‌ర్‌ని సిద్ధం చేసింది. త‌మ క‌ల‌ల ప్రాజెక్టును ఇదిగో ఇలా అభివృద్ధి చేస్తామ‌ని కొనుగోలుదారులు, పెట్టుబ‌డిదారుల ముందు ఉంచింది. ఈ విష‌యాన్ని కొంద‌రు బ‌య్య‌ర్లు రియ‌ల్ ఎస్టేట్ గురు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని క్షుణ్నంగా ప‌రిశీలించ‌గా.. ఐరా రియాల్టీ అనే సంస్థ రెరా అనుమ‌తి తీసుకోలేద‌ని అర్థ‌మైంది. ఈ సంస్థ ప్ర‌కారం.. రానున్న రోజుల్లో డీటీసీపీ అనుమ‌తి తీసుకుంటారు. దాదాపు 150 ఎక‌రాల్లో ప్ర‌పంచ స్థాయి విల్లాలు, అల్ట్రా ప్రీమియం అపార్టుమెంట్లు, హెచ్ఎండీఏ లేఅవుట్ల‌ను అభివృద్ధి చేస్తారు. ఒక్కో ప్లాటును 600, 1200 గ‌జాల్లో విక్ర‌యిస్తారు.
ప్ర‌స్తుతం అక్క‌డ చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.12 నుంచి 15 వేల వ‌ర‌కూ గ‌జం ధ‌ర ఉంది. కాక‌పోతే, ఐరా రియాల్టీ సంస్థ చ‌ద‌ర‌పు గ‌జానికి రూ.8,500 చొప్పున ఇక్క‌డి ప్లాట్ల‌ను విక్ర‌యిస్తోంది. 150 ఎక‌రాల్లో యాభై శాతాన్ని మిన‌హాయిస్తే.. మిగ‌తా 75 ఎక‌రాల్లో లేఅవుట్‌ని అభివృద్ధి చేస్తుంద‌ని అనుకుందాం. అంటే, 3,63,000 గ‌జాల స్థ‌లాన్ని అభివృద్ధి చేస్తుంది. దీన్ని గ‌జం రూ.8,500 చొప్పున లెక్కిస్తే.. దాదాపు రూ.308 కోట్ల‌ను వ‌సూలు చేస్తోంద‌న్న‌మాట‌. ఇందులో స‌గం ప్లాట్లు అమ్ముడైనా ఈ కంపెనీ ఎంత‌లేద‌న్నా కొనుగోలుదారులు, పెట్టుబ‌డిదారుల నుంచి సుమారు 150 కోట్ల‌ను వ‌సూలు చేయ‌డం ప‌క్కా అన్న‌మాట‌. ఇలాంటివి ఎన్ని సంస్థ‌లు.. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో.. ప్ర‌జ‌ల్నుంచి ఇంత అక్ర‌మంగా సొమ్ము వ‌సూలు చేస్తున్నాయా? మ‌రి, రెరా అనుమ‌తి లేకుండా ఇన్ని కోట్ల రూపాయ‌ల్ని అక్ర‌మంగా వ‌సూలు చేయ‌వ‌చ్చా? విజ్ఞులైన నిర్మాణ సంఘాల పెద్ద‌లు, పుర‌పాల‌క శాఖ అధికారులు, రెరా యంత్రాంగ‌మే దీనికి స‌మాధానమివ్వాలి. ఇప్ప‌టికైనా తెలంగాణ ప్ర‌భుత్వం క‌ళ్లు తెరుచుకుని ఇలాంటి అక్ర‌మ రియ‌ల్ సంస్థ‌లపై కొర‌డా ఝ‌ళిపించాలి. ఈ ఐరా రియాల్టీ సంస్థకు ఏదైనా నిర్మాణ సంఘంలో స‌భ్య‌త్వం ఉంటే.. వెంట‌నే ఆయా సంఘం ఈ సంస్థ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి.

This website uses cookies.