ప్రశాంత వాతావరణం, చక్కని ఆశ్రయం, ఇష్టమైన కుటుంబ సభ్యులు, సురక్షితమైన స్థలం.. ఇదీ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కలల ఇంటి ముచ్చట. కుర్రకారు మది దోచుకున్న ఈ భామకు హైదరాబాద్ లో ఇప్పటికే ఓ అందమైన ఇల్లు ఉంది. ఈ నేపథ్యంలో తన కలల సౌథం ఎలా ఉండాలని కోరుకుంటుందో పాఠకులకు చెప్పాలంటూ రకుల్ ను ఒప్పించడంతో ఆమె రియల్ ఎస్టేట్ గురుతో తన ఆలోచనలు, ఆకాంక్షలు పంచుకుంది.
2016లో హైదరాబాద్ లో తన తొలి కలల ఇంటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ‘మా నాన్న కారణంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఇళ్లలో చెదిరిపోయాయి. ఆయన ఆర్మీ అధికారి కావడంతో వివిధ ప్రాంతాల్లో నివసించాం. నాకు కొండపైన ఉండే ఇల్లంటే చాలా ఇష్టం. నా దృష్టి దానిమీదే ఉంటుంది’ అని రకుల్ వెల్లడించింది. అలాగే కనీసస్థాయి డెకర్ నే ఆమె ఇష్టపడుతుందని, కళ్లు చెదిరే రంగులు కాకుండా మనసును ఆహ్లాదపరిచే లేత రంగులంటేనే ఇష్టమని వివరించింది. ఇలాంటి లేత రంగులు కళ్లకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంది. వెచ్చగా, హాయిగా.. ఇంకా ఎంతో ఓదార్పునిచ్చే ఇంటి చుట్టూ భారీగా మొక్కలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు తనకు నచ్చవని తెలిపింది.
‘ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా నా దగ్గర ఉన్నప్పటికీ, నేను నా ఇంటికి ఎలాంటి సమస్యా లేకుండా ఉంచడానికే ప్రాధాన్యత ఇస్తాను. ఇది మీకు ఆధ్యాత్మిక చింతనలు కలగజేస్తుంది. ఇంకా నాకు విల్లాలంటే చాలా ఇష్టం. స్విమ్మింగ్ పూల్, చక్కని సిట్ అవుట్ ఉంటే చాలు. రోజంతా పని చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఒత్తిడి నుంచి విముక్తురాలిని కావాలనుకుంటాను. నా ఆలోచనలన్నీ నేను నివసించే ఇంట్లో ప్రతిబింబించాలి’ అని రకుల్ పేర్కొంది.
బీచ్ లో తన కలల సౌథం నిర్మించుకోవడమే లక్ష్యమని రకుల్ వెల్లడించింది. కచ్చితంగా అలాంటి చోట ఓపెన్ ఎయిర్ విల్లా కట్టి తీరతానని స్పష్టంచేసింది. ‘కొన్నిసార్లు మొత్తం స్పేస్ మనకే కావాలని అనిపిస్తుంది. పైగా ఆ స్థలంలో ప్రైవేటు పూల్, పెద్ద తోట, అంతులేని సముద్ర వీక్షణ ఉంటే అది మరింత బావుంటుంది’ అని తెలిపింది. చివరకు చాలాసేపు ఆలోచించిన తర్వాత భారత్ బయట పరిశుభ్రమైన బీచ్ లో డ్రీమ్ విల్లా కట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టు వివరించింది. ఇక్కడ అలాంటి పరిశుభ్రమైన బీచ్ లు మచ్చుకైనా కనిపించవు కదా అని సరదాగా వ్యాఖ్యానించింది. భారీ లాన్, అంతులేని పూల్, హోమ్ థియేటర్, ఓపెన్ ఏరియా.. ఇవీ ఎవరికైనా తమ డ్రీమ్ హోమ్ లో కావాల్సిన అంశాలని రకుల్ అభిప్రాయపడింది. అలాగే మన ఇంటికి పెద్ద పెద్ద అద్దాల కిటికీలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయని చెప్పింది.
* ఇంటీరియర్ అనేది ఇంటికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. ‘ముంబై, హైదరాబాద్ లోని నా ఇళ్లు నా ఆలోచనలకు అనుగుణంగా నిర్మితమయ్యాయి. ఇంటిని అందంగా అలంకరించేందుకు అవసరమైన డెకార్ షాపింగ్ నేనే చేశాను. నా ఆలోచలన్నీ నా ఇంట్లో ప్రతిఫలిస్తాయి. ఇలా చేయడం వల్ల మీ ఇంటితో మీకు మరింత అనుబంధం ఏర్పడుతుంది’ అని పేర్కొంది. శిల్పారెడ్డి ఇంటీరియర్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించింది. ఇక మన నగరంతో తన అనుబంధాన్ని వివరిస్తూ.. ‘నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. కొనుగోలు చేయడానికి ఎంతో సుందరమైన ప్రాపర్టీలు ఉంటాయి. మనచుట్టూ అద్భుతమైన వ్యక్తులు నివసిస్తుంటారు’ అని తెలిపింది. ఇల్లంటే భవిష్యత్తు అని.. తాను ఏది ప్రారంభించిన దానికి పునాది ఇల్లేనని చెబుతూ ముగించింది.
This website uses cookies.