వర్షాలు మొదలవ్వడంతో దోమల దాడి పెరుగుతుంది.. ఫలితంగా మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం లేకపోలేదు. మరి, వీటిని నిరోధించాలంటే ఏం చేయాలి? ఏమాత్రం ఆలస్యం చేయకుండా తలుపులు, కిటికీలకు దోమ తెరల్ని బిగించుకోవాలి.
వర్షం పడేటప్పుడు కలిగే ఆనందమే వేరు. కాకపోతే, అది ఆగిపోయిన తర్వాతే అసలు సమస్య పుట్టుకొస్తుంది. వర్షం నిలిచిపోయాక ఇంటి చుట్టూ చేరే నీటితో వచ్చే దోమలు, క్రిములు, కీటకాల వల్లే అసలు సమస్య వస్తుంది. ఇంట్లోకి ప్రవేశించడానికి ఏ చిన్న సందు దొరికినా చాలు. తమ ప్రతాపాన్ని చూపెడతాయి. దోమ కాటు వేస్తే చాలు.. మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వంటి జ్వరాలు మానసిక ఆందోళనను కలిగిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే, డెంగీ జ్వరాల వల్ల చిన్న పిల్లలూ దుర్మరణం చెందిన సంఘటనలున్నాయి. అందుకే, ఈ సమస్యను అధిగమించాలంటే.. ఆధునిక దోమ తెరలు చక్కగా పనికొస్తాయి. ముఖ్యంగా, ఫైబర్ గ్లాస్, స్టెయిన్ లెస్ స్టీల్, అల్యూమినియం, రాగి, పెట్ స్క్రీన్ వంటివి విరివిగా దొరుకుతున్నాయి. పాశ్చాత్యదేశాల్లో దొరికే అనేక దోమతెరలు మన వద్ద కూడా లభిస్తున్నాయనే విషయం మర్చిపోవద్దు.
ఆరంభ ధర.. 20 వేలు
దోమ తెరలు అనేవి దాదాపు అన్ని అపార్టుమెంట్లలో దర్శనమిస్తున్నాయి. పాత అపార్టుమెంట్ అయినా కొత్త ఫ్లాటు అయినా ఇవి లేకుండా కనిపించడం లేదంటే నమ్మండి. పైగా, ఇందులోనూ అనేక రకాలు. అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీల్, ఫైబర్ గ్లాస్, రాగి, పెట్ స్క్రీన్ వంటి వాటికి ఆదరణ ఎక్కువగా ఉంది. సింగిల్ డోర్, డబుల్ డోర్, స్లైడింగ్ వంటి రకాలు మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. ధర విషయానికొస్తే.. చదరపు అడుక్కీ రూ.80 నుంచి దొరుకుతున్నాయి. గరిష్ఠంగా రూ.600 దాకా అమ్మే సంస్థలున్నాయంటే నమ్మండి. సాధారణంగా అధిక శాతం ఇళ్లల్లో తలుపులకు 7/3 అడుగులు, కిటికీలకు 6/4 అడుగుల్లో దొరికే దోమ తెరల్ని బిగిస్తారు. ఓ డబుల్ బెడ్రూం ఫ్లాటులోని తలుపులు, కిటికీలకు నాణ్యమైన దోమ తెరల్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీసం రూ.20 వేలు ఖర్చు అవుతుంది. గరిష్ఠంగా లక్షన్నర దాకా ఖర్చవుతుంది.