అద్దాల భవనాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందువల్లే మనదేశంలోని వాణిజ్య రియల్ ఎస్టేట్ లో వీటి వినియోగం ఎక్కువ. భవనాల ముందు భాగాన్ని ఆకర్షణీయమైన గ్లాస్ ప్యానెళ్లతో అందంగా తీర్చిదిద్దుతుంటారు. ముఖ్యంగా మెట్రోలు, ప్రధాన నగరాల్లో ఇలాంటి భవనాలు చాలా కనిపిస్తుంటాయి. కార్పొరేట్ అద్దెదారులు చక్కగా మెరిసే భవనాలను ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే వారి ఆకాంక్షలకు అనుగుణంగా సొగసైన రీతిలో అద్దాల భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. గోడలకు బదులు గ్లాస్ అమర్చడం వల్ల బయటి దృశ్యాలు చక్కగా ఆస్వాదించే వీలు కలుగుతుంది. పైగా గాజును కూడా ఎలాంటి ఆకారంలోనైనా వంచే వీలుంది. అయితే, గాజు అమరిక భవనానికి వన్నె తేవడంతోపాటు పలు ప్రయోజనాలు కల్పిస్తున్నా.. కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. అవేంటో చూద్దామా?
అందం, ఆకర్షణీయం..
ఇది భవనానికి అందాన్ని, ఆకర్షణీయతను జోడిస్తుంది. వివిధ ఆకృతుల్లో మౌల్డ్ చేసే విలుంది కాబట్టి, ఆర్కిటెక్ట్ కు సౌలభ్యాన్ని ఇస్తుంది. గ్లాస్ నుంచి 75 శాతం నుంచి 80 శాతం సహజకాంతి రెండు వైపుల నుంచీ ప్రసారమవుతుంది. మరే వస్తువుకూ ఇది సాధ్య కాదు. గాజు సాధారణంగా వాతావరణ నిరోధకతను కలిగి ఉంటుంది. అందువల్ల వర్షాలు, ఎండ, గాలి వంటి వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. ఇది ఏ వాతావరణంలోనైనా దాని ఆకారాన్ని, ప్రకాశాన్ని కోల్పోదు. గాజు తుప్పు కూడా పట్టదు కాబట్టి ఇనుము కంటే మెరుగ్గా ఉంటుంది.
అలాగే పరిసర పర్యావరణ పరిస్థితులకు లొంగదు. ఇది మృదువైన ఉపరితలం కలిగి ఉంటుంది కాబట్టి, ఒక విధంగా దుమ్ము-నిరోధకతను కలిగి ఉంటుంది. లామినేటెడ్ లేదా కలర్ షీట్లను కలిపితే మరింత అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా భవనం పునాదిపై బరువును తగ్గిస్తుంది. గోడలతో పోలిస్తే భవనాన్ని తేలిక చేస్తుంది. సరైన గ్లాస్ ను ఎంపిక చేసుకుంటే ఇంట్లో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా కరెంటు బిల్లు ఆదా అవుతుంది. పైగా గ్లాస్ నిర్వహణ వ్యయం కూడా తక్కువే. నెలకోసారి శభ్రపరుచుకుంటే చాలు. ఇక చాలా రకాల అద్దాలు రాపిడి నిరోధకతను కలిగి ఉంటాయి. అంటే మరో పదార్థంతో రుద్దినా కూడా అరిగిపోదు.
వేడి ఉంటే కష్టమే!
అద్దాల ముఖ భాగాలు చాలా కాంతిని కలిగిస్తాయి. ఇదే దాని ప్రధాన ప్రతికూలత. అంతేకాకుండా గ్లాస్ వేడిని గ్రహిస్తుంది. వేడి వాతావరణం ఉన్న దేశాలకు ఇది తగినది కాదు. చాలా అద్దాలు భూకంపాలను తట్టుకోలేవు. అందువల్ల తరచూ భూకంపాలు సంభవించే దేశాలకూ సరిపోవు. భూకంప నిరోధక గృహాలకు వినియోగించే అద్దాలను కూడా భూకంపాలను తట్టుకునేలా చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అద్దాల భవనాలను సురక్షితంగా ఉంచడానికి చాలా ఖర్చు పెట్టక తప్పదు. ఎందుకంటే గ్లాస్ అనేది దృఢమైన, పెలుసుగా ఉండే పదార్థం. అకస్మాత్తుగా ఒత్తిడికి గురైతే సులభంగా విరిగిపోతుంది. ఇక హరిత భవనాల దిశగా ప్రపంచం అడుగులు వేస్తున్న తరుణంలో అద్దాల భవనాలు అందుకు సరిపోవు. చాలా వాతావరణాలకు అద్దాల భవనాలు సరిపోవని నిపుణులు చెబుతున్నారు.