ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో ముంబై రియల్ ఎస్టేట్ రంగం దూకుడు కొనసాగిస్తోంది. 2023 మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మే నెలలో రిజిస్ట్రేషన్లు 17 శాతం పెరిగాయి. 2023 మే నెలలో 9,823 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది 11,520 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 80 శాతం రెసిడెన్షియల్ లావాదేవీలే ఉన్నాయి. అంటే ముంబైలో హౌసింగ్ డిమాండ్ అలాగే కొనసాగుతోంది. ఇక రిజిస్ట్రేషన్లలో 500 చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల మధ్యనున్న ప్రాపర్టీలు 51 శాతంగా నమోదయ్యాయి. అటు కొనుగోలుదారులు, ఇటు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో డెవలపర్లు కొనుగోలుదారుల ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నారు.
ప్రముఖ డెవలపర్లు ప్రైమ్ లొకేషన్లలో ఆధునిక సౌకర్యాలు, వసతులతో ప్రాజెక్టులు చేపడుతున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లోని కొత్త ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న తరుణంలో ఈ డిమాండ్ ఇలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురికి ముంబైలో సొంతిల్లు ఉండం అనేది ఓ కల అని.. అందుకే ముంబైలో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా ఉండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ముంబైలో తొలి సారి ఇల్లు కొంటున్నవారే కాకుండా తమ ఇంటిని అప్ గ్రేడ్ చేసుకునేవారు కూడా పెరుగుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే మే నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. తద్వారా ఖజానాకు స్టాంపు డ్యూటీ రూపంలో ఆ ఒక్కనెలలోనే రూ.992 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది మే నెలలో వచ్చిన రూ.832 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 19 శాతం ఎక్కువ.
This website uses cookies.