తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు, భవనాల అనుమతులు ఆలస్యం అవుతున్నాయని ఇటీవల క్రెడాయ్ నిర్వహించిన సర్వేలో తేలింది. కేవలం ఇరవై శాతానికే సకాలంలో అనుమతులు వస్తుంటే.. మిగతా ఎనభై శాతానికి రావడం లేదని బహిర్గతమైంది. తెలంగాణలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇల్లు, భవనాల అనుమతుల విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. డీపీఎంఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 21 రోజుల్లోనే అనుమతుల్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించారు. అక్రమ కట్టడాల్ని నిరోధించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందుకోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కొత్తగా టాస్క్ ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేసేలా చట్టంలో మార్పులు తెచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేసేందుకు పకడ్బందీ చర్యల్ని తీసుకున్నారు. కాకపోతే, నేటికీ కొందరు మున్సిపల్ అధికారులు పాత పాటే పాడుతున్నారు.
పురపాలక శాఖ అధికారులు ఎప్పటిలాగే అనుమతుల్ని ఆలస్యం చేస్తున్నారు. కేటీఆర్ చెబితే.. మేం వినాలా? అన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక్క కొర్రీ పెట్టి అనుమతిని ఆలస్యం చేస్తున్నారు. దీంతో, నిర్మాణ సంస్థలకు చిర్రెత్తుకొస్తుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. మంత్రికేమో నేరుగా వెళ్లి చెప్పుకోలేరు.. ఆయనేమో కిందికి దిగి.. దిగువ స్థాయి అధికారులకు చెప్పలేరు. మొత్తానికి, తెలంగాణ ఆవిర్భవించి ఏడేళ్లు కావస్తున్నా.. ఇంకా పాత వాసనల్ని కొందరు అధికారులు, సిబ్బంది వదిలిపెట్టడం లేదు. అనుమతుల్ని మంజూరు చేసే విషయంలో నేటికీ ఇబ్బందుల్ని పెడుతూనే ఉన్నారు. దీర్ఘకాలం నుంచి ఒకే చోట పని చేసే సిబ్బందిని బదిలీ చేయాలని పురపాలక శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. మరి, అలాంటి వారిని పురపాలక శాఖ గుర్తిస్తుందా? ఏమైనా చర్యలు తీసుకుంటుందా?
* గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అనుమతులు ఆలస్యమయ్యే ప్రసక్తే లేదు. జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవెందర్ రెడ్డి ఎప్పటికప్పుడు అనుమతుల్ని క్లియర్ చేస్తుంటారనే మంచి పేరుంది. సమస్యల్లా జోన్లలోనే కావడం గమనార్హం. పైగా పట్టణాభివృద్ధి సంస్థలు, కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలైతే కాసులిస్తేనే అనుమతి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని డెవలపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాస్త బుర్ర పెట్టి ఆలోచించకుండా.. ఏదో ఒక కొర్రీ పెట్టి ఫైలును నిలిపివేస్తున్నారు. ఆన్ లైన్ లో అనుమతి కోసం దరఖాస్తు చేసినా.. వ్యక్తిగతంగా వెళ్లి సంబంధిత అధికారుల్ని కలిస్తే తప్ప ఫైలు ముందుకు కదలడం లేదని పలువురు బిల్డర్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో దారుణం..
ఇళ్ల అనుమతులు ఆలస్యమవుతున్నాయని క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ బిల్డర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. అమరావతి ప్రాంతాన్ని మినహాయిస్తే కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలో కొత్త నిర్మాణాలు పెరుగుతున్నాయి. కాకపోతే, అనుమతుల విషయంలో ఎక్కువ ఆలస్యం జరుగుతుందని.. చేయి తడిపితే తప్ప చేతికి అనుమతి రాని దుస్థితి నెలకొందని డెవలపర్లు అంటున్నారు. ఆదోని, అనంతపూర్, భీమవరం, చిత్తూరు, ధర్మవరం, ఏలూరు, గుంతకల్లు, హిందుపూర్, కడప, కావాలి, మచిలీపట్నం, మదనపల్లె, నంద్యాల, నరసరావుపేట్, ఒంగోలు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి వంటి చిన్న పట్టణాల్లోనూ అనుమతులు ఆలస్యం అవుతున్నాయి.