” సెకండ్ వేవ్ వల్ల నిర్మాణ రంగం దారుణంగా ఇబ్బంది పడింది. స్టీలు, సిమెంటు, కేబుళ్లు, పీవీసీ వస్తువులు వంటి నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్నంటాయి. సిమెంటు 40 శాతం, స్టీలు 30 శాతం, ఇతర నిర్మాణ సామగ్రి 20 శాతం చొప్పున పెరిగాయి. కార్మికుల కొరత దారుణంగా పెరిగింది. వారికి అధిక సొమ్మును వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పైగా, వారు నివసించే ప్రాంతాన్ని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రంగా ఉంచుతున్నాం. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల్ని ఆరా తీస్తున్నాం. కొనుగోలుదారులు బయటికి రాకపోవడం.. ఇంటి కొనుగోలును వాయిదా వేయడం వల్ల అమ్మకాలూ తగ్గుముఖం పట్టాయి. బ్యాంకులు సైతం కనీస సిబ్బందితోనే పని చేయడం వల్ల గృహరుణాల మంజూరు ఆలస్యం అవుతున్నాయి. ఫలితంగా, నిర్మాణ పనులు మందగిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో నిర్మాణ సామగ్రి రవాణా కూడా ఇబ్బందిగా మారింది.
ఒకట్రెండు నెలల్లో ఖాయం..
కొవిడ్ డెల్టా వేరియంట్ ఇట్టే సోకుతుందనే అంశాన్ని తెలుసుకుని చాలామంది కొనుగోలుదారులు భయపడుతున్నారు. అందుకే, ప్రీ కొవిడ్ తో పోల్చితే ప్రస్తుతం బయ్యర్లు ప్రాజెక్టుల్ని చూడటానికి రావడం లేదు. కాకపోతే, మా సిబ్బంది సానుకూలంగా ఉన్న కొనుగోలుదారుల్ని సంప్రదిస్తున్నారు. వారిలో కొందరూ కొవిడ్ సమయంలోనూ ఫ్లాట్లను కొనుగోలు చేయడం గమనార్హం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో రేట్లు తగ్గుతాయేమోనని చాలామంది అంచనా వేస్తున్నారు. కానీ, పెరిగిన నిర్మాణ వ్యయంతో పోల్చుకుంటే ధర తగ్గే ప్రసక్తే లేదు. వాస్తవానికి, అధిక శాతం మంది డెవలపర్లు బలవంతంగా అయినా రేట్లను పెంచాల్సిందే. ప్రాజెక్టు పనుల్ని మృదువుగా కొనసాగేందుకు కొందరు ఆ నిర్ణయాన్ని తీసుకోవట్లేదు. కానీ, కొందరైతే కచ్చింతగా ఒకట్రెండు నెలల్లో ఫ్లాట్ల రేట్లు అయితే పెంచుతారు.
దక్షిణాదితో పాటు రాంచీలో..
ప్రస్తుతం మేం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, రాంచీలో ప్రాజెక్టుల్ని చేపడుతున్నాం. నార్సింగిలో ముప్పయ్ లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇప్పటికే ఆరు టవర్లను హ్యాండోవర్ చేశాం. మిగతావి మరో ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపు అందజేస్తాం. బెంగళూరులో 8 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్న అపార్టుమెంట్ ఏడాదిలోపు పూర్తవుతుంది. అక్కడే ఎలహంక, సర్జాపూర్ రోడ్డులో రెండు విల్లా ప్రాజెక్టుల్ని చేపడుతున్నాం. చెన్నైలోని ఓఎమ్మార్ మరియు పల్లవరంలో రెండు అపార్టుమెంట్లను కడుతున్నాం. రాంచీలో 55 ఎకరాల్లో సుమారు 1800 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. మొదటి ఫేజులో 1200 ఫ్లాట్లను నిర్మించి కొనుగోలుదారులకు అందజేశాం. రెండో ఫేజులో 600 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. మరో రెండేళ్లలో టవర్ వారీగా పూర్తి చేస్తాం.
చివరగా..
బెంగళూరు, చెన్నైలో కలిపి దాదాపు నలభై లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేయడానికి ప్రణాళికల్ని రచిస్తున్నాం. అంటే, దాదాపు ఐదు నిర్మాణాల్ని ఆ రెండు నగరాల్లోనే చేస్తున్నాం. మిగతా పలు నిర్మాణాలు అనుమతులు, డాక్యుమెంటేషన్ దశలో ఉన్నాయి. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారికి ఇంతకు మించిన తరుణం లేదనే చెప్పాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. ఇలా ఎక్కడైనా పెట్టుబడి పెడితే మంచి రాబడిని అందుకోవచ్చు. ధరలింకా తగ్గుతాయనే అంశాన్ని మర్చిపోవాలి. రానున్న రోజుల్లో పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం ఉండదు. గృహరుణంపై వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి స్థిర నివాసానికైనా.. పెట్టుబడికైనా.. ఇంతకుమించిన తరుణం లేదనే చెప్పాలి.