Categories: EXCLUSIVE INTERVIEWS

111 జీవో కాగితం మీదే.. అనుస‌రించేది త‌క్కువే!

  • ఈ జీవో ఎత్తివేత‌ను స్వాగ‌తిస్తున్నాం
  • ముప్పా ప్రాజెక్ట్స్ చైర్మన్ ముప్పా వెంకయ్య చౌదరి

ట్రిపుల్ వన్ జీవోని రద్దు చేయడం స్వాగతిస్తున్నామని ముప్పా ప్రాజెక్ట్స్ చైర్మన్ ముప్పా వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ జీవో పేపర్ మీదే ఉంది తప్ప.. ఎవరూ అనుసరించడంలేదన్నారు. ఈ జీవో ఉన్న ప్రాంతంలో గత కొన్నేళ్లుగా కొత్త నిర్మాణాల్ని కడుతున్నార‌ని చెప్పారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేతపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే..

‘ ఈ ప్రాంతంలో అనేక మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటి వల్ల ఎంత కాలుష్యం వస్తుందనేది అందరికీ తెలిసిందే. ట్రిపుల్ వన్ జీవో ఉన్న ప్రాంతంలో ఎలాంటి నియంత్రణా లేదు. ఎవరికి కావాల్సిన విధంగా వారు ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తున్నారు. అందువల్ల ట్రిపుల్ వన్ జీవో ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగంలేదు. దీనిని రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది. పక్కనే ఉన్న కోకాపేట వంటి ప్రాంతాల్లో కోట్లు పెట్టి వద్ద పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. దాని పక్కనే ఉన్న వట్టి నాగులపల్లిలో ఏమీ కట్టొద్దంటే ఎలా? అందువల్ల ఇక్కడ షరతులతో అనుమతులు ఇస్తే బాగుంటుంది.

111 జీవో ఉన్న ఏరియాలో ప్రభుత్వం మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. దీనిని మంచి ప్లాన్డ్ సిటీగా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలకు, ఐటీ కార్యాలయాలకు, ప్రైవేటు ఆఫీసులకు, పార్కులకు, వాటర్ బాడీలకు స్థలాన్ని నిర్దేశించాలి. పెద్ద పెద్ద రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వంటివి ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం మెట్రో రైలు వేయాలంటే ఉన్న రోడ్డుపైనే వేసు పరిస్థితి. ఉన్న రోడ్లు ఇరుకుగా ఉన్నాయనుకుంటే.. మెట్రో రైలు, కరెంటు లైన్లు వంటివాటితో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మెట్రో రైలు వచ్చినా.. బుల్లెట్ రైలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులూ రావు. ఇలా చేస్తే హైదరాబాద్ లో మరో సుందరమైన ప్రాంతం వస్తుంది.’

This website uses cookies.