Categories: EXCLUSIVE INTERVIEWS

మై డ్రీమ్ హోమ్‌ క‌డ‌లి ప‌క్క‌నే క‌ల‌ల గృహం – 2017 మిస్ ఆసియా ఆకాంక్ష సింగ్

2017 మిస్ ఆసియా ఆకాంక్ష సింగ్ మాన‌సిక ఆరోగ్యంపై అవ‌గాహ‌నను పెంపొందించే కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు న‌గ‌రానికి విచ్చేశారు. డెహ్ర‌డూన్ కి చెందిన ఈ అందాల భామ కేబీఆర్ పార్కులో ప‌లువురు వాక‌ర్ల‌తో స‌ర‌దాగా ముచ్చ‌టించింది. వారి మానసిక ఆరోగ్యం గురించి అపోహలు మరియు ఆందోళనల గురించి తెలుసుకుంది. అతి త్వ‌ర‌లో ఓ అగ్ర న‌టుడితో క‌లిసి టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్న అందాల తార ఆకాంక్ష సింగ్ రియ‌ల్ ఎస్టేట్ గురుతో ముచ్చ‌టించింది. త‌న క‌ల‌ల గృహం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించింది. సారాంశం ఆమె మాట‌ల్లోనే..

“రోజంతా క‌ష్టించి ప‌ని చేసి అల‌సిపోయి ఇంటికి చేరిన త‌ర్వాత ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలంటే మ‌న‌కు అన్నివిధాల న‌ప్పే విధంగా క‌ల‌ల గృహాన్ని తీర్చిదిద్దుకోవాలి. మ‌న జీవితంలోని ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదించడంతో పాటు స‌ర‌దాగా బంధుమిత్రుల‌తో పార్టీలు జ‌రుపుకోవ‌డానికి త‌ప్ప‌నిస‌రిగా మ‌న‌కంటూ ఓ సొంతిల్లు ఉండాల్సిందే.

Akanksha Singh

అందుకే నాకు ఇంటికి సంబంధించి పెద్ద ప్ర‌ణాళిక‌లే ఉన్నాయి. ఈ విష‌యంలో నాకో కోరిక ఉంది. మా తల్లీదండ్రులు డెహ్ర‌డూన్‌లో ఉంటారు. నేనేమో ప్ర‌స్తుతం ముంబైలో నివ‌సిస్తున్నాను. నాకు నీళ్ల‌న్నా.. స‌ముద్రం అన్నా మ‌హా ఇష్టం. కాబ‌ట్టి, స‌ముద్రం ప‌క్క‌నే.. చ‌ల్ల‌టి గాలీని ఆస్వాదించే విధంగా ఓ సొంతిల్లు ఉండాలన్న‌దే నా చిర‌కాల కోరిక‌. నేనీ రంగంలో క‌ష్ట‌ప‌డి నా క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని అనుకుంటున్నాను. నాకంటూ ఓ సొంత ఇంటిని క‌ట్టుకుని, నా త‌ల్లీదండ్రుల‌తో పాటు బాల్క‌నీలో కూర్చుని స‌ముద్ర అందాల్ని ఆస్వాదించాల‌న్నదే ల‌క్ష్యం. ఈ క్ర‌మంలో నా క‌ల‌ల గృహం ఎలా ఉండాల‌నే అంశంపై ప్ర‌త్యేకంగా ఒక వీడియో కూడా రూపొందించాను. ఇంటి డిజైన్‌, ఇంటీరియ‌ర్స్‌, కిచెన్ శ్లాబులు ఎలా ఉండాలి? ఏ త‌ర‌హా ఎల్ఈడీ లైట్లు అమ‌ర్చాలి? వంటి అంశాలపై నాకంటూ ప్ర‌త్యేక ఆలోచ‌న‌లున్నాయి.

* ప‌డ‌క గ‌ది బ్యాక్ గ్రౌండ్ పింక్ రంగులో ఉండ‌టంతో పాటు సీలింగ్ నుంచి ల్యాంపులు కిందికి వేలాడేలా ఉండాల‌ని నా కోరిక‌. అతిపెద్ద కిటికీని ఏర్పాటు చేసుకుని.. దాని ప‌క్క‌నే ఉద‌యం పూట కూర్చుని కాఫీ తాగాలి. వేగంగా ప‌రిగెత్తే న‌గ‌రాన్ని వీక్షించ‌డంతో పాటు రాత్రివేళ‌లో న‌గ‌రంలో వెలిగే లైట్ల‌ను తిలకించాల‌ని ఉంది. ఇంటీరియ‌ర్స్ కు సంబంధించి ప్ర‌త్యేకంగా ఆలోచ‌న‌లున్నాయి కాబ‌ట్టి.. సీలింగ్ నుంచి వేలాడే బ‌ల్బులు ఉండాల‌ని భావిస్తున్నాను. నేను కళ్ళు మూసుకుంటే చాలు, నా కలల వంట గదిలో కూర్చొని భోజనం చేసి జ్ఞాపకాలను సృష్టించుకుంటాను”.

This website uses cookies.