Categories: TOP STORIES

కొంచెం అయితే.. ‘కోకాపేట్’ ఖతమే!

    • జాతీయ, అంతర్జాతీయ సంస్థల్ని
    • ఆకర్షించని ‘కోకాపేట్‘ వేలం
    • ‘కరోనా’ ప్రధాన కారణమా?
    • ఎట్టకేలకు ముగిసిన వేలం
    • మన సంస్థలు పాల్గొనకపోతే అంతే సంగతులు

కోకాపేట్ ( Kokapet ) వేలం పాటల్లో స్థలాన్ని దక్కించుకోవడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడతాయమని భావిస్తే నిరాశే ఎదురైంది. ఫార్మా కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, విదేశీ రీట్లు వంటివి పాల్గొంటాయని అనుకోవడం అత్యాశగా మారింది. చివరికీ, హైదరాబాద్ రియాల్టీ కంపెనీలే స్థలాన్ని దక్కించుకుని.. హైదరాబాద్ పరువును నిలబెట్టాయి. ఈ వేలంలో స్థలం అమ్ముడు కాకపోయి ఉంటే.. హైదరాబాద్ బ్రాండ్ మీద ప్రతికూల ప్రభావం పడేది.

కొంతకాలం నుంచి క్షుణ్నంగా గమనిస్తే.. విదేశీ సంస్థల ప్రతినిధులు నగరానికి రావడం.. మంత్రి కేటీఆర్ని కలవడం.. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నామని చెప్పడం.. ఆనవాయితీగా వస్తున్నది. నాలుగు రోజుల క్రితమే.. సింగపూర్ హై కమిషనర్ సైమన్ వింగ్ విచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయమై మంత్రితో చర్చించారు. జూన్ 24న ట్రైటన్ ఈవీ సంస్థ ఫౌండర్, సీఈవో మహమ్మద్ మన్సూర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గత నాలుగైదేళ్లలో మంత్రి కేటీఆర్ని అనేక దేశ, విదేశీ సంస్థల ప్రతినిధులు కలిసి చర్చించారు. గంటలకొద్దీ సమయం వెచ్చించి.. తెలంగాణ రాష్ట్రంలో గల పెట్టుబడి అవకాశాల్ని ఆయన వివరించారు. మంత్రి కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా.. పెట్టుబడుల్నిఆకర్షించడం మీదే ఫోకస్ పెట్టేవారు. కానీ, ఈ కోకాపేట్ వేలంలో పాల్గొనేలా ఆ సంస్థల్ని ఆకర్షించడంలో మాత్రం విఫలమయ్యారని ప్రజలు భావిస్తున్నారు.

కలిసికట్టుగా పని చేయలేదా?

ప్రభుత్వమెంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వేలం పాటల్ని నిర్వహించేటప్పుడు.. ఐటీ, పరిశ్రమల శాఖ మరియు హెచ్ఎండీఏలు కలిసికట్టుగా పని చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్ని ఇందులో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తే మెరుగ్గా ఉండేది. దేశ, విదేశీ కంపెనీలు వచ్చినప్పుడే మన నగర ప్రతిష్ఠ మరింత పెరిగేది. కాకపోతే, ఈ రెండు సంస్థల మధ్య కో-ఆర్డినేషన్ సరిగ్గా లేదనే విషయం స్పష్టంగా కనిపించింది.

గతంలో కోకాపేట్ భూముల వేలం పాటల్ని నిర్వహించినప్పుడు.. క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్ రెడ్డి తదితరులు జాతీయ నిర్మాణ సంస్థల్ని వేలం పాటల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించారు. ఆయన నేరుగా అనేక జాతీయ రియల్ సంస్థల అధిపతులతో చర్చించారు. వారిని వేలం పాటల్లో పాల్గొనేందుకు ఆహ్వానించారు. కాకపోతే, వేలం పాటలయ్యాక కోర్టు కేసు ఏర్పడటంతో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారింది. ప్రస్తుతం ఈ భూములకు సంబంధించి అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. కోకాపేట్లో స్థలాన్ని సొంతం చేసుకోవడానికి జాతీయ నిర్మాణ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇందుకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు.

This website uses cookies.