Categories: TOP STORIES

ఆర్థిక మంత్రి.. రియాల్టీని ఆదుకోండి!

    • బ‌డ్జెట్‌లో నిర్మాణ రంగాన్ని ప్రోత్స‌హించాలి
    • క్రెడాయ్ జాతీయ ఉపాధ్య‌క్షుడు గుమ్మి రాంరెడ్డి

ఆర్థికరంగం కరోనా నుంచి కోలుకుంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఇళ్లకు గిరాకీ పెరిగేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని క్రెడాయ్ నేషనల్ ఉపాధ్యక్షుడ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. 2022-23 సంవత్సరానికి కేంద్రం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పలు అంశాలపై తాము సమగ్ర ప్రతిపాదనలు పంపించినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై ఆయన ‘రియల్ ఎస్టేట్ గురు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగులకు పన్ను రిబేట్ పరిమితిని పెంచాలని కోరినట్లు తెలిపారు. మరి, కేంద్రానికి క్రెడాయ్ పంపించిన ప్రతిపాదనల్లో కీలకాంశాల గురించి ఆయన మాటల్లోనే..

 

అందుబాటు ధరలో గృహాలు

మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా, నాన్ మెట్రో నగరాల్లో 90 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా కలిగిన యూనిట్ అందుబాటు ధరలో గృహాల జాబితాలోకి వస్తాయి. అలాగే ఆ ఇంటి స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలకు మించి ఉండకూడదు. అయితే, సరసమైన గృహాల కింద కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు తీసుకురావడంతో ఏది సరసమైన గృహమో తెలియని గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిని సవరించాలి.

మెట్రో నగరాల్లో యూనిట్ విలువను రూ.1.50 కోట్లకు, నాన్ మెట్రో నగరాల్లో యూనిట్ విలువను రూ.75 లక్షలకు పెంచాలని సవరణ ప్రతిపాదన చేశాం. అలాగే యూనిట్ కార్పెట్ ఏరియాను మెట్రోల్లో 90 చదరపు మీటర్లు, ఇతర ప్రాంతాల్లో 120 చదరపు మీటర్లకు మించరాదు.
దాదాపు 80 శాతం నాన్ మెట్రో నగరాల్లో చదరపు అడుగు రూ.5 వేల కంటే తక్కువే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ 90 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా తీసుకుంటే యూనిట్ విలువ రూ.48.42 లక్షలు అవుతుంది. దీంతో అందుబాటు ధరలో గృహం కింద ఇది అర్హత పొందదు. అలాగే చాలా మెట్రో నగరాల్లోని 80 శాతం ప్రాంతాల్లో చదరపు అడుగు రూ.7,500 కంటే తక్కువ ఉంది. దీంతో అక్కడ 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా తీసుకుంటే యూనిట్ విలువ రూ.48.42 లక్షలు అవుతుంది. ఇది కూడా ప్రభుత్వం నిర్దేశించిన రూ.45 లక్షల కంటే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే క్రెడాయ్ సవరణలను ప్రతిపాదించింది.
2020 మార్చి 31 వరకు అనుమతి పొందిన ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. సహేతుకమైన ఆలస్యంలో మాత్రమే అందుబాటు ధరలో గృహాలకు సంబంధించిన విస్తృతమైన ప్రయోజనాలు గరిష్టంగా లబ్ధి పొందే వెసులుబాటు ఉంటుంది. అయితే, 2023 మార్చి 31 వరకు అనుమతి పొందిన ప్రాజెక్టులకు దీనిని వర్తింపజేయాలని క్రెడాయ్ సవరణ ప్రతిపాదన చేశాం.
గృహ నిర్మాణాన్ని పెంచడం వల్ల అటు వృద్ధిపరంగా, ఇటు ఉపాధి పరంగా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం వదులుకున్న ఆదాయ పన్ను రాబడి ఈ సెక్షన్ ద్వారా పరోక్ష, స్టాంప్ డ్యూటీ కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

సెక్షన్ 80-ఐబీఏ..

మొదటి ఆమోదం వచ్చిన తేదీ నుంచి ఐదేళ్ల లోపు పూర్తయిన ప్రాజెక్టులకు మాత్రమే సెక్షన్ 80-ఐబీఏ కింద 100 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. డెవలపర్లు 2016 జూన్ ఒకటో తేదీ కంటే ముందుగా ఆమోదం పొంది, ప్రస్తుతం దానిని అందుబాటు ధరలో గృహాల కిందకు మార్చుకున్నా.. పన్ను రాయితీ రావడం లేదు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సెక్షన్ 80- ఐబీఏ లో ఉన్న క్లాజును సవరించాలని క్రెడాయ్ కోరింది. ప్లాన్ అనుమతి పొందినా, నిర్మాణం మొదలు కాని ప్రాజెక్టులకు దీనిని వర్తింపచేయాలని సవరణ ప్రతిపాదన చేశాం. రెరా పరిశీలన తర్వాతే వాటికి పన్ను మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నాం.

సెక్షన్ 24 (బి).. గృహ రుణంపై వడ్డీ మినహాయింపు

ప్రస్తుతం 24 (బి) సెక్షన్ కింద అద్దె ఆదాయంపై వడ్డీ మినహాయింపు పరిమితి రూ.2 లక్షలుగా ఉంది. వ్యక్తుల విషయంలో స్వయంగా నివసిస్తున్న తొలి ప్రాపర్టీలో దీనికి ఎలాంటి పరిమితి విధించకుండా ఆమోదించాలని కేంద్రాన్ని కోరాం. ప్రత్యామ్నాయంగా వడ్డీ మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని విన్నవించాం.

అద్దె ఇళ్ల ప్రోత్సాహానికి..

నివాస గృహాలను కొనుగోలు చేసిన తర్వాత వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంపై వ్యక్తులు, సంస్థలపై ప్రస్తుతం పన్ను విధిస్తున్నారు. ఏటా రూ.20 లక్షల వరకు వచ్చే అద్దె ఆదాయంపై వంద శాతం పన్ను మినహాయింపును ఇవ్వాలని ప్రతిపాదించాం.

రీట్స్ నిబంధనల్లో సడలింపులు..

ప్రస్తుతం 80 సి కింద ఎలాంటి నిబంధనలూ లేవు. ఈ నేపథ్యంలో రీట్స్ కింద రూ.50వేల నుంచి మొదలయ్యే పెట్టుబడులకు సెక్షన్ 80 సి కింద మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదన చేశాం. ప్రస్తుతం సెక్షన్ 2(42ఏ) కింద రీట్స్ ను దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణించేందుకు 36 నెలల సమయం పడుతోంది. దీనిని 12 నెలలకు తగ్గించాలి.

గృహరుణంలో అసలు చెల్లింపు..

ప్రస్తుతం గృహరుణంలో అసలు చెల్లింపునకు సంబంధించి రూ.లక్షన్నర వరకే 80 సి కింద పన్ను మినహాయింపు వస్తోంది. పైగా ఇతరత్రా పొదుపు పెట్టుబడులు కూడా ఇందులో భాగంగానే పరిగణిస్తున్నారు. దీనిని వ్యక్తులకు ఇంటి విలువతో సంబంధం లేకుండా ఐదేళ్లలో రూ.50 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలి. అలాగే 80 సి కింద గృహరుణం అసలు చెల్లింపుపై పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.50 లక్షల నుంచి పెంచాలి. లేదా ప్రత్యామ్నాయంగా దీనిని ఒక్కదానిని ప్రత్యేక విభాగంలో ఈ మేరకు మినహాయింపు కల్పించాలి.

This website uses cookies.