Categories: LEGAL

సుప్రీం కోర్టుతోనే ఆటలా?

  • జైలుకు పంపిస్తాం
  • సూపర్ టెక్ డైరెక్టర్లపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం
  • సోమవారంలోగా పరిహారం చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక

నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్లకు సంబంధించిన కేసులో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్ టెక్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను కూల్చివేయాల్సిందిగా గతేడాది ఆగస్టులో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, అందులో ఫ్లాట్లు కొనుగోలుచేసినవారికి డబ్బులు తిరిగి చెల్లించే విషయంలో సూపర్ టెక్ సక్రమంగా వ్యవహరించలేదంటూ పలువురు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓవైపు డబ్బులు చెల్లిస్తాం రమ్మని చెబుతున్నారని..

తీరా అక్కడకు వెళితే, వాయిదా పద్ధతుల్లో ఇస్తామని చెప్పడంతో పాటు కోర్టు చెప్పకపోయినా కొంత మొత్తం మినహాయించుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, సూపర్ టెక్ డైరెక్టర్లపై మండిపడింది. ‘మీ డైరెక్టర్లను జైలుకు పంపిస్తాం. వారు సుప్రీంకోర్టుతోనే ఆటలాడుతున్నారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా ఉండేందుకు అన్ని రకాల కారణాలూ వెతుకుతున్నారు. సోమవారం లోగా చెల్లింపులు జరపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని సూపర్ టెక్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం హెచ్చరించింది.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను కూల్చివేయాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. మూడు నెలల్లోగా వాటిని కూల్చివేయాలని గతేడాది ఆగస్టు 31న తీర్పు వెలువరించింది. నోయిడా అధికారుల పర్యవేక్షణలో సొంత ఖర్చుతోనే వాటిని కూల్చివేయాలని సూపర్ టెక్ ను ఆదేశించింది. అంతేకాకుండా అందులో ఫ్లాట్లు కొన్న వారికి రెండు నెలల్లోగా వారు చెల్లించిన మొత్తాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి రూ.2 కోట్లు చెల్లించాలని సూచించింది.

This website uses cookies.