Categories: LATEST UPDATES

రియాల్టీ ద్వారా.. సంపద ఎలా సృష్టించాలి?

తక్కువ సమయంలో ఎక్కువ, స్థిరమైన ఆదాయం అందించే రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. రియల్ ఎస్టేట్ పెట్టుబడి అనేది ఓ ఆకర్షణీయమైన అంశం. అయితే, ఈ మార్కెట్లో పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముందుగా మార్కెట్ డైనమిక్స్అర్థం చేసుకోవాలి. ప్రాపర్టీ ధరలు, లొకేషన్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బిల్డర్ పరపతి, రియల్ ఎస్టేట్ లావాదేవీలలో స్థానిక నిబంధనలు, ఆస్తి పన్నులు, చట్టపరమైన విధానాలు అధ్యయం చేయాలి. ఇవన్నీ అర్థం చేసుకుంటే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.

ఆస్తి రకాలు..

దీర్ఘకాల సంపద కోసం చూస్తున్నారా? లేక తక్షణ రాబడుల కోసం ఆలోచిస్తున్నారా? మీ రిస్క్ అంశాన్ని నిర్ణయించుకుని తదనుగుణంగా నిధులు కేటాయించాలి. నివాస, వాణిజ్య లేదా అద్దె ఆస్తుల్లో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలి. అద్దె ప్రాపర్టీలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలో సరైన ఆస్తిని ఎంచుకుని పెట్టుబడి పెట్టండి.

లోకేషన్ ఎంపిక..

రియల్ ఎస్టట్ లో పెట్టుబడి విజయాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశం లొకేషన్. అభివృద్ధి అవకాశాలు, పట్టణ కేంద్రాలకు సామీప్యత, మంచి కనెక్టివిటీ, పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ కేంద్రాలు వంటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవాలి. అభివృద్ధి చెందుతున్న పొరుగు ప్రాంతాల లేదా అధిక వృద్ధికి అవకాశాలు ఉన్న నగరాలను గుర్తించడానికి మార్కెట్ ట్రెండ్ లు పరిశీలించాలి. ఏ ప్రాంతాల్లో ఏయే ప్రాపర్టీలకు డిమాండ్ ఉందో తెలుసుకుని తదనుగుణంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.

బడ్జెటింగ్..

ఆస్తి ఖర్చులు, పన్నులు, నిర్వహణ, పునర్నిర్మాణ ఖర్చులు వంటి అన్ని అంశాలతో మొత్తం ఎంత వ్యయం అవుతుందో బడ్జెట్ వేసుకోవాలి. రుణాలు లేదా తనఖాలు వంటి ఫైనాన్సింగ్ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నగదు ప్రవాహంపై వాటి ప్రభావం ఎలా ఉందో బేరీజు వేసుకోవాలి. ఆశించిన రాబడి, నగదు ప్రవావాహాలను లెక్కించాలి. ఉదాహరణకు మీరు రూ.50 లక్షల విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే.. పదేళ్ల తర్వాత దాని విలువ రూ.కోటి అవుతుందనుకుందాం. అయితే, ఇందులో రుణ వడ్డీ ఇతర ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

తగిన శ్రద్ధ.

ఏదైనా ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు తగిన శ్రద్ధ కనబరచాలి. చట్టపరమైన వివాదాలు లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం ఆస్తి హక్కు పత్రాలు అన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేయాలి. ఒప్పందాలు స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి న్యాయ నిపుణుల సహాయం తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన ఆస్తి డాక్యుమెంటేషన్, పన్ను చిక్కులను అర్థం చేసుకోవాలి.

నిర్వహణ..

అద్దె ప్రాపర్టీల్లో పెట్టుబడి పెడితే, అద్దెదారులను జాగ్రత్తగా పరిశీలించాలి. అద్దెదారులతో చక్కని సంబంధాలు కొనసాగించాలి. రెగ్యులర్ మెయింటనెన్స్ ఆస్తి విలువను పెంచడమే కాకుండా అద్దెదారును సంతృప్తిపరుస్తుంది. బహుళ ప్రాపర్టీలను కలిగి ఉంటే.. సమర్థవంతమైన నిర్వహణ కోసం ప్రాఫెషనల్ ప్రాపర్టీ మేనేజర్లను నియమించే అవకాశం పరిశీలించండి. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితుల ఆధారంగా పెట్టుబడి వ్యూహాన్ని మార్చుకునే వెసులుబాటు కలిగి ఉండండి. ఆస్తి విలువ, అద్దె రాబడి, డిమాండ్-సరఫరా వంటి అంశాలు పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో గణనీయమైన విజయం సాధించొచ్చు.

This website uses cookies.