జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఆకాశహర్మ్యాల సంఖ్య పెరుగుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కేవలం పశ్చిమ హైదరాబాదే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోనూ వీటిని నిర్మించడానికి పలువురు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రామాంతపూర్, ఎల్ బీ నగర్, మియాపూర్, పటాన్ చెరు వంటి ప్రాంతాల్లోనూ వీటిని కట్టేందుకు ముందుకొచ్చారు. ఈ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ ఇటీవల అనుమతిని మంజూరు చేసింది. ఇందులో కొన్నింటికీ ఇప్పటికే రెరా అనుమతి లభించగా.. మరికొన్ని రెరాకు దరఖాస్తు చేశాయి. మరి, ఏయే ప్రాజెక్టులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్నాయంటే..
డీఎస్సార్ ఎస్ఆర్ ప్రైమ్ స్పేసెస్ సంస్థ షేక్ పేట్లో గ్రౌండ్ ప్లస్ 34 అంతస్తుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ అనుమతిని మంజూరు చేసింది. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్లు.. 434. దీని ఎత్తు 126.6 మీటర్లు.
అరబిందో రియాల్టీ మాదాపూర్లోని ఖానామెట్లో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఎత్తు గ్రౌండ్ ప్లస్ 41 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో వచ్చే ఫ్లాట్ల సంఖ్య దాదాపు 161. టవర్ ఎత్తు సుమారు 135 మీటర్లు ఉంటుంది.
మై స్కేప్ ప్రాపర్టీస్ నానక్ రాంగూడలో గ్రౌండ్ ప్లస్ 33 అంతస్తుల ఎత్తులో ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. ఈ టవర్లో వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. సుమారు 31 మాత్రమే. నిర్మాణం ఎత్తు సుమారు 122.9 మీటర్లు.
రామాంతపూర్లోని 157, 158, 159, 160 సర్వే నెంబర్లలో ఒక సంస్థ.. 41 అంతస్తుల ఎత్తులో ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 586 ఫ్లాట్లు వస్తాయి. నిర్మాణం ఎత్తు.. దాదాపు 135.2 మీటర్లు.
మదీనాగూడలో ఓ నిర్మాణ సంస్థ గ్రౌండ్ ప్లస్ 46 అంతస్తుల ఎత్తులో బడా ఆకాశహర్మ్యం నిర్మిస్తోంది. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. 742. మదీనాగూడలోని 200/ఏఏ,201/ఏఏ & 205/2/ఏఏ సర్వే నెంబర్లలో చేపడుతున్న ఈ నిర్మాణం ఎత్తు 141.8 మీటర్ల దాకా ఉంటుంది.
రాయదుర్గం చేరువలోని ఖాజాగూడలో సోహినీ డెవలపర్స్ గ్రౌండ్ ప్లస్ 46 అంతస్తుల ఎత్తులో సరికొత్త ఆకాశహర్మ్యం నిర్మిస్తోంది. సర్వే నెంబర్ 27/2లో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 974 ఫ్లాట్లను కడతారు. ఈ నిర్మాణం ఎత్తు దాదాపు 194.7 మీటర్ల ఎత్తు ఉంటుంది.
ఇవే కాకుండా మియాపూర్లోని వర్టెక్స్ విరాట్, శేరిలింగంపల్లిలోని క్యాండియర్ క్రీసెంట్ తదితర సంస్థలు జీహెచ్ఎంసీ పరిధిలో ఆకాశహర్మ్యాల్ని ఆరంభించాయి. ఆకాశహర్మ్యాల ప్రత్యేకత ఏమిటంటే.. గాలీ, వెలుతురు ధారళంగా ప్రసరిస్తుంది. ఎత్తయిన టవర్లలో ఉండటం వల్ల కాలుష్యం ఇంట్లోకి రాదు. ఈ అంశాన్ని అర్థం చేసుకున్న అనేక మంది కొనుగోలుదారులు.. ఆకాశహర్మ్యాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.