ఓ ఇరవై, ఇరవై ఐదేళ్లు వెనక్కి వెళితే.. హైదరాబాద్లో అనేక చోట్ల ఆడుకోవడానికి మైదానాలుండేవి. కానీ, ఇప్పుడో భూతద్ధం పెట్టి వెతికినా కనిపించడం లేదు. ప్రధానంగా, ఐటీ రంగం ఆవిర్భవించాక.. స్థలాలకు గిరాకీ పెరగడంతో.. ఎక్కడ పడితే అక్కడ అపార్టుమెంట్లను కట్టేస్తున్నారు. అది పార్కు స్థలమా? ఇతర అవసరాల కోసం వదిలేసిన స్థలమా? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు కొందరు కట్టేస్తున్నారు.
ఈ అంశం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కాలంలో అదనపు కలెక్టర్లను హెచ్చరించిన విషయం తెలిసిందే. కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే తాజాగా వేలం పాటల్ని నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వేలం పాటల్ని వ్యతిరేకించిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ.. ఎందుకు భూముల్ని అమ్ముతున్నారు? వీళ్లను అప్పులు చేయమన్నదెవరు? భూముల్ని విక్రయించి కట్టమన్నదెవరు అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
* గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భూముల వేలం పాటల్ని నిర్వహించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఇతర స్థలాలకు అదే రేటు స్థిరపడిపోయింది. భూముల ధరలకు కృత్రిమంగా రేటు పెరిగే పోకడకు అప్పుడే బీజం పడింది. ఆతర్వాత కూడా వేలం పాటల్ని నిర్వహించడంతో ప్రభుత్వమే ధరల్ని పెంచేసిందన్న అపఖ్యాతిని మూటగట్టుకుంది. అయితే, అప్పట్లో ఆ పోకడను వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక వేలం పాటల్ని చేపట్టడంతో భూముల రేట్లు మళ్లీ ఆకాశాన్నంటేశాయి.
ఫలితంగా, హైదరాబాద్ లో సామాన్యుడు ఫ్లాటు కొనుక్కోలేని దుస్థితి ఏర్పడింది. అసలు హైదరాబాద్ అనేది కేవలం డబ్బున్న ఆసాములకే పరిమితమనే స్థాయిలో ప్లాట్లు, ఫ్లాట్ల రేట్లు పెరిగిపోయింది. మరి, దానికి తగ్గట్టుగా అద్దెలు పెరిగాయా? అంటే పెరగలేదనే చెప్పాలి. ఈ క్రమంలో తాజాగా కోకాపేట్, ఖానామెట్‌లో వేలం పాటల్ని నిర్వహించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో సామాన్యులకు ఆడుకోవడానికి ఆటస్థలాలు, ఖాళీ స్థలాలు లేకుండా చేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎంత ప్రశ్నించినా.. అధికార పార్టీ తన వైఖరీ మార్చుకుంటుందా?
This website uses cookies.