Categories: LEGAL

బిల్డర్లకు కాదు.. అధికారులకూ జరిమానా

సాధారణంగా బిల్డర్లు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేస్తే.. వారికి జరిమానా విధించడం, ఇతరత్రా చర్యలు చేపట్టడం వంటి పరిణామాలు చూస్తుంటాం. కానీ బల్డర్లు నిబంధనలు పాటించకుంటే.. ఇకపై అధికారులు కూడా బాధ్యులు కానున్నారు. భవన నిబంధనలు పక్కాగా అమలు చేయడంలో విఫలమైనందుకు వారికి జరిమానా విధించాలని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది. దీనికి సంబంధించి జూలై 6, 21వ తేదీల్లో జీవోలు జారీ చేశామని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ వెల్లడించారు.

పార్కింగ్ ఏరియాలో షాపులు, టెర్రస్ పై అదనపు ఫ్లాట్లు నిర్మించారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని బసవేశ్వరనగర్ లోని సుశోభిత్ రెసిడెన్సీకి చెందిన ఎనిమిది మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. నిబంధనల ఉల్లంఘన జరిగిన సందర్భంలో కేవలం బిల్డర్ల పైనే నెపం మోపకుండా అధికారులను కూడా బాధ్యులను చేయాల్సి ఉంటుందని.. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలతో రావాలని బీబీఎంపీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా, నిబంధనల ఉల్లంఘనను అడ్డుకోలేని అధికారులకు జరిమానా విధించేలా బీబీఎంపీ భవన బైలాస్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

This website uses cookies.