ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన అరబిందో రియాల్టీ ఎండీ శరత్ చంద్రారెడ్డికి రౌస్ ఎవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శరత్‌చంద్రారెడ్డి నానమ్మ అంత్యక్రియల దృష్ట్యా బెయిల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ.2 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక నిందితుడు.
ఆయన మూడు కంపెనీల ద్వారా సుమారు రూ.64 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో నుంచి దాదాపు రూ. అరవై కోట్లను ఇండో స్పిరిట్స్ కంపెనీకి బదిలీ చేసినట్లు విచారణలో బయటపడిందని తెలిసింది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఎలాంటి ఆధారాల్లేకుండా సర్వర్లలోని సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ట్రైడెంట్ ఛాంపర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్గనోమిక్స్ ఎకోసిస్టమ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా శరత్ చంద్రారెడ్డి కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా జరిపారని ఈడీ రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రకారం ఏ వ్యక్తి కూడా రెండు జోన్లకు మించి మద్యం వ్యాపారం చేయకూడదనేది నిబంధన. కానీ, శరత్ చంద్రారెడ్డి 30 శాతం దుకాణాలను బినామీ కంపెనీల ద్వారా దక్కించుకున్నారని ఈడీ అభియోగం మోపింది.
తన సొంత పెట్టుబడుల ద్వారా శరత్ చంద్రారెడ్డి వీటిని నియంత్రిస్తున్నారని పేర్కొంది. మరి, ఆయన ఎక్కడ్నుంచి ఈ పెట్టుబడులు పెట్టారనేది విచారణ కొనసాగుతోంది. ఈలోపు నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు రెండు వారాల పాటు బెయిల్ లభించింది.