రూపాయి విలువ పతనంతో
రియల్ పెట్టుబడులకు ఆసక్తి
భారత రియల్ ఎస్టేట్ రంగం డైనమిక్ పరివర్తన చవిచూస్తోంది. డాలరుతో పోలిస్తే మన రూపాయి విలువ 11 శాతం క్షీణించడంతో ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం రియల్ రంగం కూడా డిజిటలైజేషన్ కావడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ నుంచే తెలుసుకునే వీలు కలిగింది. ఒక ప్రాపర్టీన అక్కడి నుంచి ప్రత్యక్షంగా తిలకించే వెసులుబాటు వచ్చింది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో ఎన్నారైలు ఇండియాలో ఆస్తి కొనాలంటే బంధువులో లేదా మధ్యవర్తులపైనో ఆధారపడాల్సి వచ్చేది. ఇంకా వారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం, బోలెడంత పేపర్ వర్క్ ఉండేది. కానీ టెక్నాలజీ ఆ పరిస్థితి దూరం చేసి, ఎన్నారైలు సులభంగా ఆస్తులు కొనుగోలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది. విదేశాలలో ఉంటూనే ఇక్కడి పరిస్థితులు, రియల్ రంగం వివరాలు తెలుసుకుంటూ సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఇందుకు ఎవరిపైనో ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. దీంతో స్వదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నారైలు ఆసక్తి కనబరుస్తున్నారు. స్వదేశంతో ఉండే భావోద్వేగమైన బంధంతోపాటు రియల్ రంగంలో పెట్టుబడులకు భద్రత, స్థిరత్వం ఉన్నాయనే భావన వారిని స్తిరాస్థి రంగం వైపు అడుగులు వేయిస్తోంది.
నిజానికి కరోనా అనంతరం దేశంలో రెండో ఇల్లు ఉండాలనే ఆలోచన చాలామంది ఎన్నారైలకు కలిగింది. దీంతో స్వదేశంలోని రియల్ రంగంలో ఎన్నారైలు పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. మరోవైపు అద్దె ఆదాయం కూడా పెరగడం కూడా ఇందుకు మరో కారణం. గతంలో 2 నుంచి 3 శాతం మధ్య ఉండే అద్దె ఆదాయం ఇప్పుడు 3 నుంచి 5 శాతానికి పెరిగింది. దీంతో చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపిస్తున్నారు. అలాగే దేశంలోని ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఆధునిక సౌకర్యాలతో కూడిన పెద్ద, విలాసవంతమైన ఇళ్ల పట్ల ఎన్నారైలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఖరీదైన ఇంటీరియర్స్ తో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులకు ఎన్నారైలు ఓటేస్తున్నారు. ఇక తమ పెట్టుబడులకు హైదరాబాద్ తోపాటు గుర్గావ్, బెంగళూరు వంటి నగరాలనే ఎంచుకుంటున్నారు. మరోవైపు అదే సమయంలో అహ్మదాబాద్, చండీగఢ్, తిరువనంతపురం, కొచ్చి వంటి చిన్న నగరాలకూ డిమాండ్ పెరుగుతోంది.