అద్దె బాండ్లు అనేవి భూస్వాములకు అద్దెదారులు అందించే ఆర్థిక హామీకి ఓ రూపం. నిజానికి మన దేశంలో రెంటల్ బాండ్ అనేది సర్వసాధారణమైన అంశం కాదు. దీనికి బదులుగా ఇంటి యజమానులు లేదా భూస్వాములు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవడానికే మొగ్గు చూపుతారు. ఈ మొత్తాన్ని ఏదైనా నష్టపరిహారం లేదా అద్దె ఒప్పందం ముగింపులో చెల్లించని అద్దె, ఇతరత్రా చార్జీలను కవర్ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే, సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఆర్థికంగా భారమైన అంశం కాబట్టి, రెంటల్ బాండ్ అనేది ఇరువురికీ ప్రయోజనకారిగా ఉంటుంది. నిర్ధారిత రుసుము వసూలు చేసిన తర్వాత అద్దె బాండ్ కంపెనీ లేదా ష్యూరిటీ ప్రొవైడర్ అద్దెదారుని తరపున బాండ్ జారీ చేస్తారు. అనంతరం అద్దెదారు ఇంటికి లేదా సదరు స్థలానికి ఏదైనా నష్టం చేసినా.. అద్దె చెల్లించకపోయినా.. ఆ సర్వీస్ ప్రొవైడర్ ఆ మొత్తాన్ని భూస్వామికి చెల్లిస్తాడు. తర్వాత ఆ మొత్తాన్ని అద్దెదారు నుంచి వసూలు చేసుకుంటాడు. దీనివల్ల భూస్వాములకు ఆర్థిక రక్షణ లభిస్తుంది. అద్దెదారు చెల్లించని అద్దె లేదా చేసిన ఇతర నష్టాలు దీని ద్వారా భర్తీ అవుతాయి. అంతేకాకుండా అద్దెదారు బాధ్యతాయుతంగా ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది.
అద్దె బాండ్లతో లాభమేంటి?
భూస్వాములకు, వారి పెట్టుబడికి భద్రతా భావాన్ని కల్పిస్తుంది. అటు భూస్వాములకే కాకుండా ఇటు అద్దెదారులకూ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అద్దె బాండ్ ను ముందుగా చెల్లించడం వల్ల అద్దె ఆస్తికి ఆమోదం పొందే అవకాశం పెరుగుతుంది. అద్దెదారు బాగా నిర్వహించే, సురక్షితమైన అద్దె ప్రాపర్టీలో నివసించడానికి వీలు కలుగుతుంది. భూస్వామి సదరు ఆస్తిని నిర్వహించడంలో విఫలమైనా.. లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించినా అద్దె బాండు సదరు ఖర్చులను భరిస్తుంది. అద్దె గడువు ముగింపులో బాండ్ ను పూర్తిగా అద్దెదారుకు తిరిగి ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది. అద్దెదారులు తమ డబ్బులు తిరిగి పొందేలా చూస్తుంది. అంతేకాకుండా భూస్వాములు, అద్దెదారుల మధ్య తలెత్తే అనేక వివాదాలను, కీలక సమస్యలను అద్దె బాండ్లు పరిష్కరించడంలో సహాయపడతాయి. అయితే, అద్దె ఒప్పందాన్ని పూర్తిగా చదివి సంతకం చేసే ముందు ఆస్తి ఎలాంటి కండిషన్ లో ఉందో చెక్ చేసుకోవాలి. అలాగే లీజు ఒప్పందాన్ని క్షుణ్నంగా చదివి అర్థం చేసుకోవాలి. చెల్లింపు నిబంధనలు పూర్తిగా పరిశీలించాలి. అద్దె చెల్లింపు తేదీ ఇతరత్రా అంశాలు ముందుగానే నిర్ధారించుకోవాలి. మీరు అద్దె ప్రాపర్టీలోకి వెళ్లే ముందు ఆ ఆస్తి అప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉందో రుజువు కోసం చిత్రాలు, వీడియో తీసుకోవాలి. ఇవన్నీ సరిగా చూసుకున్న తర్వాతే అద్దె బాండుపై సంతకం చేయాలి