Categories: LATEST UPDATES

ఆధార్ తరహాలో ఆస్తులకూ నంబర్

స్థిరాస్తుల విక్రయాల్లో అక్రమాలు, మోసాలను నిరోధించేందుకు కర్ణాటక రెవెన్యూ విభాగం నడుం బిగించింది. రాష్ట్రంలో యూనిఫైడ్ ల్యాండ్ మేనేజ్ మెంట్ సిస్టం (యూఎల్ఎంఎస్) తీసుకురావాలని యోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ప్రతి ప్రాపర్టీకి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. ఇక ఆ ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలూ అందులోనే ఉంటాయి. ఒక భూమికి సంబంధించిన పత్రాలన్నీ ఒకేచోట ఉన్న పక్షంలో భూ యజమానులు వాటిని సులభంగా చూసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, నకిలీ పత్రాల ద్వారా అమ్మకాలు జరపడం వీలుపడదు.
ప్రస్తుతం ఒక భూమికి సంబంధించిన అంశాలు వివిధ విభాగాల పరిధిలో ఉండటం వల్ల నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడటానికి అక్రమార్కులకు అవకాశం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ఇలాంటి మోసాలకు చెక్ చెప్పొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ తరహా వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో లక్షలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి మోసాలను నిరోధించేందుకు యూఎల్ఎంస్ తీసుకురావాలని రాఫ్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

This website uses cookies.